తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చింది.
కానీ ఇప్పటివరకూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు పదవులు ఇస్తారా? అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ విజయం కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా ఆశ పడుతున్నారు.
తెలంగాణలో ఉనికే ప్రమాదంలో పడ్డ కాంగ్రెస్ గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్య కారణమైతే.. ఆయన పిలుపుతో ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు మరో కారణం.
తమ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో భాగమవ్వాలనే నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీళ్లందరూ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయిస్తారనే ఆశతో ఉన్నారు.
కానీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌తో ఇన్ని రోజులు ఈ పదవులను భర్తీ చేయలేదు. ఇప్పుడు కోడ్ ముగిసింది అయినా నిరీక్షణ తప్పడం లేదు. ఈ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉండటం, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో భర్తీ కోసం టైం పట్టే అవకాశముంది.
జెండా మోసిన నాయకులు పదవిపై కోరికతో ఉన్నారు కానీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే వాళ్ల కల తీరుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడూ అని నాయకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.