కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. “పిల్ల కాలువలన్నీ.. సముద్రంలో కలవాల్సిందే“ అని షర్మిల అన్నారు. అయితే.. ఆ `పిల్ల కాలువ` ఏదో మాత్రం చెప్పలేదు. కానీ, ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ అధికారం కోల్పోవడం.. 151 స్థానాల నుంచి 11 సీట్లకు జారుకున్న నేపథ్యంలో వైసీపీని ఉద్దేశించే షర్మిల వ్యాఖ్యానించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలను తీసుకుంటే.. కాంగ్రెస్ తర్వాత.. కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా అధికారంలోకి వచ్చాయి. ఇక, ఇతర చిన్నా చితకా పార్టీలకు పెద్దగా వాల్యూ లేదు. జై భారత్ నేషనల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీలు ఉన్నా..వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తెలిసి నా.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా.. 0.0001 శాతం ఓటు బ్యాంకు కూడా.. అవి దక్కించుకోలేక పోయారు. పార్టీ అధినేతలమని చెప్పుకొనే వారే ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో షర్మిల అన్నట్టుగా `పిల్ల కాలువ` పార్టీ అంటూ ఏదీలేదు. కానీ, ఆమె ఉద్దేశంలో వైసీపీనే అయి ఉంటుందని.. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి దారుణ స్థాయికి చేరుకున్న లక్ష్యంలో ఆమె చాలా నర్మగర్భంగా వ్యాఖ్యానించి ఉంటారని చెబుతున్నారు. వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని.. ఎప్పుడో 8 ఏళ్ల కిందట వైఎస్ ఆత్మగా పేరున్న రామచంద్రరావు రాయబారం నెరిపారు. అప్పట్లో ఆ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు.
అయితే.. జగన్ కనీసం కాంగ్రెస్ మాట కూడా ఎత్తలేదు. ఇప్పుడు.. మాత్రం పరిస్థితి దారుణంగా తయారైం ది. ఈ నేపథ్యంలోనే షర్మిల.. వైసీపీని ఉద్దేశించి `పిల్ల కాలువ`గా పోల్చి ఉంటారని.. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందేనన్న భావనతో ఆమె చెప్పి ఉంటారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మరి షర్మిల ఉద్దేశం ఏంటి? ఏం జరుగుతుంది? అనేది ఫ్యూచర్ తేల్చాల్సిందే.