రజనీ ‘విడుదలై’నట్లేనా ?!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత విడుదల రజనీ పార్టీ మారుతుందా ? తన మీద వస్తున్న ఆరోపణలు, విచారణల నుండి బయటపడేందుకు ఆమె బీజేపీ వైపు చూస్తున్నారా ? త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారా ? విడుదల రజనిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా జగన్, సజ్జల రామక్రిష్ణారెడ్డిలకు అందుబాటులోకి రావడం లేదా ? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.

2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరిన విడుదల రజని చిలుకలూరిపేట శాసనసభ స్థానం నుండి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు మీద ఎనిమిది వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత జగన్ మంత్రి వర్గంలో ఏకంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా వ్యవహరించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల మార్పులో భాగంగా జగన్ విడుదల రజనికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టారు.

గుంటూరు పశ్చిమం నుండి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో విడుదల రజని 51150 భారీ తేడాది ఘోర పరాజయం చవిచూసింది. చిలుకలూరిపేట నుండి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర నాయుడు 33262 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పత్తిపాటి పుల్లారావు ఇదే నియోజకవర్గం నుండి 2009లో మర్రి రాజశేఖర్ పై 20 వేల పైచిలుకు మెజారిటీతో, 2014లో 11 వేల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.

అయితే గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా విడుదల రజని ఎదుర్కొన్న ఆరోపణల మీద తాజగా గెలిచిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆరాతీస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీలో మంత్రి హోదాలో ఆమె అనేక అవతవకలకు పాల్పడిందని చెబుతున్నారు. వీటన్నింటిని తప్పించుకోవాలంటే బీజేపీ సేఫ్ జోన్ గా రజని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే వైసీపీ బిగ్ షాక్ అని చెప్పాలి.