టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య ఎంతటి ఎమోషనల్ బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత టీడీపీ, జనసేనల పొత్తుపై పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురై చేసిన సంచలన ప్రకటన మొదలు చంద్రబాబు సీఎం అయ్యే వరకు ఈ ఇద్దరు నేతల మధ్య ఆత్మీయ బంధం పలు సందర్భాల్లో ప్రస్ఫుటమైంది. ముఖ్యంగా, ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత చంద్రబాబును కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ప్రతిపాదించిన సందర్భంలో చంద్రబాబు జైల్లో ఎంత నలిగిపోయారో పవన్ చెబుతూ ఆయనను ఆలింగనం చేసుకుంటూ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాబు, పవన్ లమధ్య బాండింగ్ ఎంత బలంగా ఉందో చెప్పే మరో సందర్భానికి ఏపీ సచివాలయం వేదికైంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత చంద్రబాబు ఛాంబర్ కు వచ్చిన జనసేనానికి సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడంతో చంద్రబాబుకు పవన్ అంటే ఎంత అభిమానమో మరోసారి స్పష్టమైంది. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు…డిప్యూటీ సీఎంగా తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చంద్రబాబు చాంబర్ లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ చిహ్నానికి చంద్రబాబు వన్నె తెచ్చారంటూ పవన్ ప్రశంసించారు. తనపై ప్రశంసలు కురిపించిన పవన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చంద్రబాబు, పవన్ భేటీ కావడం ఇదే తొలిసారి.
పవన్ కల్యాణ్ తన ఛాంబర్ కు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ తో సచివాలయానికి వచ్చిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates