నమ్మి.. తనతో నడిచిన వారికి ప్రస్తుతం ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. రాజకీయంగానే కాకుండా.. అధికారికంగా కూడా..తనను నమ్మిన వారిని పై ఎత్తులో కూర్చోబెడుతున్నారు. రాజకీయంగా చూసుకుంటే.. జనసేన అధినేత పవన్‌కు భారీ పీట వేశారు. ఇక, అధికారికంగా చూస్తే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా.. నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈయన గతంలో చంద్రబాబు అమరావతి ప్రాజెక్టును చేపట్టినప్పుడు.. అక్కడ పనిచేశారు. నిజాయితీగా చంద్రబాబు చెప్పిన పనిచేశారు. దీంతో సర్కారు రావడంతోనే తొలి నియామకం.. నీరబ్ కుమార్ నుంచే మొదలైంది.
ఇక, తాజాగా సర్కారుకు న్యాయపరమైన సేవలు అందించడంలో కీలకమైన అడ్వొకేట్ జనరల్ పదవిని కూడా.. నమ్మకానికే చంద్రబాబు కట్టబెట్టారు. తాజాగా ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా సీనియర్ మోస్టు న్యాయవాది.. దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారు. ఈయన వచ్చే ఐదు సంవత్సరాలు కూడా.. చంద్రబాబు సర్కారుకు న్యాయసేవలు అందించనున్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు సర్కారుపై వెల్లువెత్తే కేసులను వాదించడంలోనూ.. సర్కారుకు ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనడంలోనూ దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించనున్నారు. ఈయనకు కేబినెట్ హోదా కల్పించనున్నారు.
ఇక, 2014-19 మధ్య ఏపీలో చంద్రబాబు పాలన చేసినప్పుడు కూడా.. అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి వ్యవహరించారు. అనేక కేసుల్లో విజయం దక్కించుకున్నారు. పోలవరంపై కేసులు సుప్రీంలో విచారణకు వచ్చినప్పుడు ఆయన వాదించి కొన్నింటిలో విజయం దక్కించుకున్నారు. ఇక, ప్రభుత్వం దిగిపోయిన 2019 తర్వాత.. పార్టీకి అండగా ఉన్నారు. చంద్రబాబుపై కేసులు నమోదైనప్పుడు.. వైసీపీ సర్కారు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై.. ముఖ్యంగా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు ప్రకటించినప్పుడు.. దమ్మాలపాటి కీలక న్యాయ సేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనకు ఇప్పుడు మరోసారి అత్యంత కీలకమైన అడ్వొకేట్ జనరల్ పొజిషన్ కల్పించారు.