జూన్ 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం, స్పీకర్ ఎంపిక కోసం ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై వెళ్లడంతో జూన్ 24 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను నిర్వహించాలని అనుకున్నారు.

కానీ, తాజాగా ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21, 22 తేదీలలో శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజులపాటు జరగబోయే సమావేశాలలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక లాంఛనమే అని తెలుస్తోంది. ఇక, జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ గా లోకం మాధవిని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా పొన్నూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రను నియమించబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.