మళ్లీ తామే అధికారంలో వస్తామనే అతి విశ్వాసంతో జగన్ ఎన్నో అరాచకాలు చేశారనే విమర్శలున్నాయి. అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కానీ ఓట్లతో జనం కొట్టిన చావుదెబ్బకు జగన్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. వైసీపీ పాతాళానికి పడిపోయింది. ఎన్నికల ఫలితాలతో ఎలాగో పరువు పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లి మరింత అవమానం పొందడం కంటే కూడా వెళ్లకుండా ఉండటమే మేలని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే అసెంబ్లీ బహిష్కరణకు జగన్ పిలుపునిస్తారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు గెలుచుకోవడంతో శాసనసభలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తనను అవమానిస్తారని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. సాధారణంగా అయితే గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుణ్ని ఎన్నుకుంటారు. కానీ జగన్ ఇప్పటివరకూ ఆ ఆలోచన చేయడం లేదు. అంతే కాకుండా ఈ నెల 22న పార్టీ విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
దీంతో ఈ సమావేశంలో అసెంబ్లీని బహిష్కరించే నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గతంలో కూడా జగన్ ఓ సారి ఇలాగే అసెంబ్లీని బహిష్కరించారు. తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదనేది అసలు ఉద్దేశంగా అప్పుడు కనిపించింది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కారణంగా చూపిస్తూ జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా ఇలాగే విస్త్రత స్థాయి సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates