ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మంత్రులు.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలవరం నుంచి తన పనిని ప్రారంభించారు. దీంతో దాదాపు కూటమి ప్రభుత్వం పని ప్రారంభించేసినట్టయింది. అయితే.. ఇంకా ఐదారుగురు మంత్రులు బాధ్యతల స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నెల 19న మంచి రోజు కావడంతో ఆ రోజు.. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కందుల దుర్గేష్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. టీడీపికి చెందిన ఒకరిద్దరు కూడా.. మంత్రులుగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.
దీంతో అసెంబ్లీ సమావేశాల విషయంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఏర్పడింది. అయితే.. తాజాగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. 24 నుంచి 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపాయి. ఈ ఐదు రోజుల్లోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్(ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు) ను ప్రవేశ పెట్టనున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్టును కూడా రద్దు చేసే బిల్లును సభ ముందుకు తీసుకురానున్నట్టు తెలిసింది.
ఇక, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో కీలకమైన స్కిల్ సెన్సస్‌కు కూడా సభ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనిని కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు. మొత్తంగా ఐదు రోజుల్లో నిర్విరామంగా సభను నడిపించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ.. తమకు సమాచారం అందినట్టు అసెంబ్లీ సచివాలయ వర్గాలు సైతం పేర్కొ న్నాయి. ఇక, దీనికి ముందు.. చంద్రబాబు తన మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. తదుపరి రోజు నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు.