అక్కడ ఏపీలో జగన్ పార్టీ ఓడిపోగానే ఇక్కడ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ముందు జీహెచ్ఎంసీ కూల్చివేతలు సంచలనంగా మారాయి. లోటస్‌పాండ్‌లోని నివాసం ముందు సెక్యూరిటీ రూమ్‌లు, ఇతర నిర్మాణాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ వాటిని కూల్చివేసింది. కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కూల్చివేతలు చేపట్టారని సంబంధిత అధికారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ నిర్మాణాలను కూల్చడం వెనుక ఓ తెలంగాణ మంత్రి ఉన్నారనే సంగతి తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఓ మంత్రి ఈ నిర్మాణాలను కూల్చివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. దీంతో ఆ అధికారి వెంటనే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అయితే దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. అందుకే వెంటనే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై వేటు పడింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఈ నిర్మాణాలను కూల్చేయడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
అయితే దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌లో కీలక మంత్రి ప్రమేయంతో ఈ కూల్చివేతలు జరిగాయనే ప్రచారం జోరందుకుంది. ఆ మంత్రి అటు వైపు ఎక్కువగా రాకపోకలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆ మంత్రి నేరుగా ఫోన్ చేసి జోనల్ కమిషనర్‌కు చెప్పడంతోనే ఈ ఆక్రమణలను తొలగించారు. కానీ దీనికి ఆ అధికారిని బాధ్యుడిగా చేస్తూ చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలు కూల్చేసిన అధికారిపై చర్యలు తీసుకోవడం ఏమిటని జనాలు ప్రశ్నిస్తున్నారు.