ఊపిరి పీల్చుకున్న ‘తాడేప‌ల్లి’..!

మాజీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటున్న ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శివారు ప్రాంతం తాడేప‌ల్లి ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. గ‌త ఐదేళ్లుగా ఇబ్బంది ప‌డిన ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం ముందు ఉన్న ర‌హ‌దారి అందుబాటులోకి వ‌చ్చింది. జగన్ ఆక్రమించుకున్న రోడ్డు నుంచి, ప్రజలకు విముక్తి లభించింది. ప్రజలు వాడుకోవలసిన రోడ్డుని, ఆక్రమించి… తన ప్యాలెస్ ముందు పేదలు ఉండటానికి వీలు లేదని, జగన్ వాళ్ళ ఇళ్లు తీసేయించిన విష‌యం తెలిసిందే.

అప్ప‌ట్లో ఈ ప‌రిణామం..తీవ్ర వివాదానికి దారి తీసింది. అయినా.. వైసీపీ నేత‌లు కానీ.. అధికారులు కానీ.. స్పందించ‌లేదు. కేవ‌లం ర‌హ‌దారిని అడ్డుకోవ‌డ‌మే కాదు.. అక్కడే ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా అధికారులు స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించి తొలగించారు. తన ఇంటి ముందు ఉన్న రోడ్డు తన కోసమే ఉపయోగించాలని, ప్రజలు మ‌రో మార్గంలో వెళ్లాల‌ని అప్ప‌ట్లో ప్ర‌భుత్వం నుంచి కూడా ఆదేశాలు వ‌చ్చాయ‌ని.. తాజాగా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఈ ర‌హ‌దారి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగిపోయాయి. విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు, తాడేపల్లి ప్యాలెస్ చూసి షాక్ తింటున్నారు. రోడ్డు ఆక్రమించి జగన్ తన ప్యాలెస్ కోసం కట్టిన కట్టడాలు, తన ఇంటి చుట్టూ 30 అడుగుల ఎత్తులో కట్టిన ఐరన్ ఫెన్సింగ్ చూసి చర్చించుకుంటున్నారు.

ఈ ర‌హ‌దారి నుంచి మంగ‌ళ‌గిరి వెళ్లేందుకు త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. ఇక‌, అక్క‌డ నుంచి రేవేంద్ర పాడు ప్రాంతానికి వెళ్లేందుకు కూడా ఇది అడ్డ‌దారి. దీంతో చిరు వ్యాపారులు.. పాల వ్యాపారులు ఇప్పుడు ఈ ర‌హ‌దారి అందుబాటులోకి రావ‌డంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మ‌రోవైపు.. చంద్ర‌బాబు స‌ర్కారు ఏ క్ష‌ణ‌మైనా ఈ ర‌హ‌దారిని ఆంక్ష‌ల నుంచి తొలగిస్తుంద‌ని అంచ‌నా వేసుకున్న మాజీ సీఎం జ‌గ‌న్ త‌నంత‌ట త‌నే అధికారులకు సందేశం పంపించి.. ఆంక్ష‌లు తొల‌గించారు. దీంతో ఇక్క‌డ ఏర్పాటు చేసిన పోలీసు ఔట్‌పోస్టును కూడా అధికారులు తొల‌గించారు.