మొత్తానికి జగన్ ప్యాలస్ లో అడుగుపెట్టిన సామాన్యుడు

విశాఖ‌ప‌ట్నం సాగ‌ర తీరంలో ఉండే ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషి కొండ‌ను తొలిచి.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప‌ర్యావ‌ర‌ణాన్ని ఛిద్రం చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెట్టినా.. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు నెత్తీ నోరూ బాదుకున్నా.. విన‌కుండా.. జ‌గ‌న్ స‌ర్కారు ముందుకు సాగింది. ఒకానొక ద‌శ‌లో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. “చెట్టు పోతే పెంచ‌గ‌లం.. కొండ కొట్టేస్తే.. పెంచ‌డం సాధ్య‌మేనా?“ అని నిల‌దీసింది.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మార‌లేదు. టీడీపీ నేత‌ల లెక్క‌ల ప్ర‌కారం 500 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి ఇక్క‌డి నిర్మాణాలు చేప‌ట్టారు. విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు నిర్మించారు. అదేమంటే.. ప్ర‌భుత్వ అవ‌సరాల కోసమ‌ని అప్ప‌ట్లో వైసీపీ పెద్ద‌లు తీర్పులు చెప్పారు.

ఇక‌, వీటిలో ఏర్పాటు చేసిన సౌక‌ర్యాలపై క‌థ‌క థ‌లుగా ప్ర‌తిప‌క్షాలు చెప్పుకొచ్చాయి. బాత్ రూమ్ క‌మోడ్స్ నుంచి టైల్స్ వ‌ర‌కు.. అంత‌ర్జాతీయంగా తెప్పించిన‌వేన‌ని అంటారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాకిని కూడా.. ఇక్క‌డ వాల‌నివ్వ‌లేదు.

కానీ, ఓడ‌లు బ‌ళ్ల‌య్యాయి. వైసీపీ వీగిపోయింది. దీంతో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఫ‌లితంగా.. రుచికొండ‌పై ఆంక్ష‌లు ఎత్తేశారు. ఒక‌ప్పుడు డీసీపీ స్తాయి అధికారిని.. ప‌ది మంది సీఐల‌ను కూడా ఇక్క‌డ నియ‌మించారు. ఈగ వాలితే కేసు పెట్టేశారు.

ఎవ‌రినైనా ఎదిరించే కామ్రెడ్ నారాయ‌ణ కూడా దిక్కుతోచ‌క‌.. హైకోర్టు నుంచి కొన్ని గంట‌ల పాటు అనుమ‌తి తెచ్చుకుని ప‌రిశీలించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇలాంటి శ‌త్రుదుర్భేధ్య‌మైన రుషి కొండ‌లో ఇప్పుడు చిన్నారులు..యువ‌త క్రికెట్ ఆడుకుంటున్నారు.

తాజాగా ఇక్క‌డ ప‌ర్య‌టించిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, భీమిలి ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు.. ఈ ముచ్చ‌ట చూసి న‌వ్వుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాంతాన్ని ఏం చేయాల‌న్న దానిపై నిర్ణ‌యం తీసుకుంటా మ‌ని తెలిపారు. వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నంతో జ‌గ‌న్ నిర్మించిన ఈ అక్ర‌మ క‌ట్ట‌డాన్ని తాము కూల్చేయ‌బోమ‌న్నారు. అయితే.. దీనిని ప్ర‌జావ‌సరాల‌కు వినియోగించ‌డ‌మో.. లేక కేంద్రానికి రెంట్‌కు ఇచ్చే అవ‌కాశం ఉంటే వారికి ఇవ్వ‌డ‌మో చేస్తే.. రాష్ట్రానికి కొంత ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తాను వ్య‌క్తిగ‌తంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు.

ఇదీ.. “కారే రాజులు.. రాజ్య‌ముల్ గెల‌వ‌రే.. గ‌ర్వోన్న‌తిన్‌ పొంద‌రే.. వారేరీ..“ అని మ‌హాక‌వి పోత‌న చెప్పిన వాక్యాలు గుర్తు చేస్తోంది!!