లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఎవరివి ?!

Lokesh red Book

ఐదేండ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐపీసీ చట్టాలను గాలికి వదిలేసి ప్రభుత్వ అధికారులు వైసీపీ చట్టాలను అమలు చేశారు అన్నది అప్పటి ప్రతిపక్ష, ప్రస్తుత అధికార పక్ష టీడీపీ నేతల వాదన.

ఈ మేరకు యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ యువనేత, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ వైసీపీ చట్టాలను అమలు చేస్తున్న అధికారుల పేర్లను ఏకంగా ‘రెడ్ బుక్‘లో నమోదు చేస్తున్నామని, అధికారం వచ్చాక వారి అంతు చూస్తామని హెచ్చరించారు.

అప్పట్లో అధికారులు లోకేష్ హెచ్చరికలను సాదరణంగా ప్రతిపక్షాలు తరచూ చేసే హెచ్చరికల మాదిరిగా లైట్ తీసుకున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 175కు 164 శాసనసభ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వారిలో టెన్షన్‌ మొదలయింది. రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అని హైరానా పడుతున్నారు.  

పగలు, ప్రతీకారాలకు తావులేని పాలనను అందిస్తామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం తప్పుచేసిన అధికారులకు మాత్రం శిక్ష తప్పదని హెచ్చరిస్తుండడంతో అధికారుల్లో అలజడి చెలరేగుతున్నది. 

గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు, తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 

ప్రధానంగా లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు పోలీసు శాఖకు చెందిన వారివే కావడం గమనార్హం. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు, కోస్తా జిల్లాలలో పోలీసుల ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తల మీద దాడులు జరిగాయి అని చెబుతున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు కూడా అవాంతరాలు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితులు లోకేష్ కు వివరించాలని కొందరు ప్రయత్నిస్తున్నా అవకాశం దొరకడం లేదని తెలుస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ కఠినంగా ఉన్నారని అంటున్నారు. మరి ఏపీలో రానున్న కాలంలో రెడ్ బుక్ ఎలాంటి కలకలం రేపుతుందో తెలుసుకోవాలంటే వేచిచూడాల్సిందే.