అమ‌రావ‌తికి ఇక ‘టైం’ పెట్టేశారు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇప్ప‌టి వ‌ర‌కు మూల‌న ఉన్న ప్రాంతంగా.. ముసురుప‌ట్టిన ప్రాంతంగా మారిపోయింది. ఎటు చూసినా తుమ్మ‌లు, తుప్ప‌లు త‌ప్ప‌.. గ‌త ఐదేళ్ల‌లో ఇక్క‌డ జ‌రిగింది.. ఒరిగింది ఏమీలేదు.

కానీ, ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డం.. సీఎం చంద్ర‌బాబు గ‌ద్దెనెక్క‌డంతో అమ‌రావ‌తి త‌ల‌రాత మారిపోనుంది. ఒక ఖ‌చ్చిత‌మైన స‌మ‌యం పెట్టుకుని.. దాని ప్ర‌కారం ప‌నులు చేసేందుకు.. కేవ‌లం మూడేళ్ల‌లోనే అమ‌రావ‌తిని 90 శాతం వ‌ర‌కు తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగించింది.

ఇదే విష‌యాన్ని తాజాగా మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏపీ పుర‌శాలక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ చెప్పారు. ఒక స‌మ‌యం పెట్టుకుని.. ఆ స‌మ‌యంలోనే అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దు తామని తెలిపారు. తాజాగా ఆయ‌న మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. స‌చివాల‌యంలో స‌తీమ‌ణితో క‌లిసి ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ మాట్లాడుతూ.. దేశంలోని ఐదు ప్రధాన న‌గ‌రాల్లో ఒక‌టిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్ద‌నున్న‌ట్టు తెలిపారు.

‘‘రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు అందజేశారు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారు. వారి విశ్వాసాన్నీ, న‌మ్మకాన్నీ నిల‌బెడ‌తాం. రాష్ట్రానికి అద్భుత‌మైన రాజ‌ధాని నిర్మాణం చేయాల‌న్న చంద్ర‌బాబు సంక‌ల్పాన్ని నిజం చేస్తాం“ అని మంత్రి నారాయ‌ణ వివ‌రించారు.

కాగా, ప్ర‌స్తుతం అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. కొన్ని పిచ్చి మొక్క‌ల‌తో నిండి పోయాయి. ఈ నేప‌థ్యంలో గ‌త వారం రోజులుగా ఇక్క‌డ తుప్ప‌లు.. పిచ్చి చెట్లు తొల‌గించే కార్య‌క్ర‌మాన్ని నిర్విరామంగా కొన‌సాగిస్తున్నారు. ఇక‌, పాత మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కార‌మే రాజ‌ధానిని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నిర్మించేందుకు రెడీఅయింది. ప్లాన్‌లో మార్పులు చేస్తే.. మ‌రోసారి కేంద్రం నుంచి అనుమ‌తులు తెచ్చుకునేందుకు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఉన్న‌దిఉన్న‌ట్టుగా న‌వ‌న‌గ‌రాల‌ను నిర్మించేందుకు ప్లాన్ చేయడం గ‌మ‌నార్హం. 2027-28మ‌ధ్య‌లో రాజ‌ధాని పూర్తి చేసేలా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.