ఇవేంటి? అనుకుంటున్నారా? అవును.. సోమవారం, శుక్రవారాలకు ఏపీలో రాజకీయ సంబంధం ఉంది. గతంలో 2014-19 మధ్య ఏపీలో చంద్రబాబు పాలన చేసినప్పుడు.. సోమవారం.. సోమవారం.. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు.
ప్రాజెక్టు తీరు తెన్నులను ఆయన పరిశీలించి.. ప్రగతిని కూడా వివరించేవారు. ఇక, అక్కడికక్కడ సమీక్షలు కూడా చేసి.. నిర్దేశం చేసేవారు. దాదాపు మూడేళ్లపాటు ఇలా సోమవారం.. సోమవారం.. ఆయన పోలవరం సందర్శనకు వెళ్లడంతో సోమవారం కాస్తా.. పోలవారంగా మారింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
ఇలా ఆయన చార్జితీసుకున్నారో లేదో .. అలా ఆయన సోమవారం.. సోమవారం.. తాను పోలవరంలో పర్యటిస్తానని ప్రకటించేశారు. అంటే సోమవారం.. మరోసారి రిపీట్ అవుతోంది.
ఇక, శుక్రవారం విషయానికి వస్తే.. అప్పట్లో 2014-19 మధ్య జగన్ తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యేవారు. ఆయన ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు కూడా శుక్రవారం.. శుక్రవారం.. విరామం ఇచ్చి మరీ.. ఆయన కోర్టు ముందు నిలబడేవారు. ఇదే విషయాన్ని అప్పట్లో టీడీపీ నాయకులు వ్యంగ్యంగా కూడా మాట్లాడేవారు.
మాజీ సీఎం జగన్ పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన 13 కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. రేపు మరోసారి ఇవి మొదటి నుంచి విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా సీఎం జగన్.. శుక్రవారం .. శుక్రవారం .. కోర్టుకు వెళ్లకతప్పదు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగాఉన్న జగన్.. 2014-19 మధ్యకాలంలో కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీంతో ఆయనను అప్పటి మంత్రి దేవినేని ఉమా సహా అనేక మంది టీడీపీ నాయకులు ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు కూడా అదేపరిస్థితి ఎదురు కానుందని తెలుస్తోంది.
ఇవి గతంలో నమోదైన కేసులు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కూడా విచారణ జరిగినా.. తాను సీఎంగా ఉన్నానని.. కాబట్టి విచారణకు రాలేదని చెప్పి.. కోర్టుకువెళ్లకుండా మేనేజ్ చేసుకున్నారు. కానీ, పార్టీ ఓడిపోయిన దరిమిలా.. ప్రతిపక్ష నాయకుడిగా మారారు. దీంతో ఆయన కోర్టుల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం లేదు.
పైగా ప్రతిపక్షానికి కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా ఏమేరకు సహకరిస్తుందనేది చెప్పడం కష్టం. ఫలితంగా జగన్ ఇకపై ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పెట్టే కేసులు దీనికి అదనంగా మారనున్నాయి. మొత్తానికి.. వచ్చే ఐదేళ్లు జగన్ కోర్టు.. న్యాయ పోరాటాలతోనే సరిపుచ్చాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates