“లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్‌కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌ను సచివాలయ ఫర్నిచర్‌తో నింపేశారు. పదవి పోయిన తర్వాత ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకుండా వాడుకుంటున్నారు” అంటూ టీడీపీ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి.
తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం, ఇంటికి అల్యూమినియం విండోస్, డోర్స్, ఫ్యాన్లు, లైట్లు, కరెంట్ సామాన్లకు రూ.73 లక్షలు, ఇంటి రెయిన్ ప్రూఫ్ పీవీసీ పగోడాస్, మొబైల్ టాయ్‌లెట్స్‌కి రూ.22.50లక్షలు వినియోగించారు. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలి కదా అని టీడీపీ వరసగా అప్పటి జీవో కాపీలను ఉటంకిస్తూ వరస ట్వీట్లు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి టీడీపీ ట్వీట్లకు కౌంటర్ ఇస్తున్నారు. “వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఫోటోలు పెట్టి టీడీపీ రాద్దాంతం చేస్తున్నది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా ఎవరు ఉన్నా.. క్యాంపు ఆఫీస్‌లకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో ఆ జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం” అని అప్పిరెడ్డి వెల్లడించాడు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా టీడీపీ నేతలు, పార్టీ పోస్టులు వ్యక్తిత్వ హననమేనని ఆయన అంటున్నాడు. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.