ఏపీ ప్రజలకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని అన్నారు. ఈ సేవ చేసే భాగ్యంతనకు కల్పించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా కంటే..ఒక ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్టపడతానని చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న పదవిని స్వార్థం కోసం ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించుకునేదిలేదన్న ఆయన.. తనకు ఇష్టమైన శాఖలు కేటాయించిన.. సీఎం చంద్రబాబుకు కూడా.. కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అటవీ సంపదను దోచుకున్నవారితో సొమ్ములను తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
“ఎంతటివారైనా.. అడవి తల్లిని దోచుకున్నవారు ఎక్కడున్నా వదిలి పెట్టను” అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, తన వారాహి యాత్ర సందర్భంగా అనేక సమస్యలను కళ్లారా చూసినట్టు చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతానని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రమే పండే ఎర్రచందనాన్ని పరిరక్షించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని తేల్చి చెప్పారు. “అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అనుభవాలు ఇవీ..
- విశాఖ మన్యం ప్రాంతంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను స్వయంగా చూశా. వారి కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తా.
- పర్యావరణం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో భాగం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. కాబట్టి పర్యావరణ మంత్రిగా కూడా దానిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటా.
- గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తా. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత ఆవశ్యం. ఆదిశగా వాటిని కూడా అభివృద్ధి చేస్తాం.
- పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తాం.
- రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెడతాం.
- సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తాం. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.