ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు ఓటు అనే ఆయుధంతో వైసీపీని పాతాళానికి తొక్కారు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలు మాత్రమే దక్కాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీకి ఈ ఫలితాలు దారుణ పరాభవం కిందే లెక్కా. ఈ ఘోర పరాజయంతోనైనా జగన్ మారతారని అనుకుంటే అదేం జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పదే పదే అదే తప్పులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తన సామాజిక వర్గానికి మాత్రమే జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. అన్ని కీలక పోస్టులనూ తన కోటరీకే కేటాయించుకున్నారు. ఇది పార్టీలోని సొంత నేతలకు, ఇతర వర్గాల ప్రజలకు ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఎన్నికల్లో జగన్‌కు చావుదెబ్బ తప్పలేదు.
ఇప్పుడు ఓడిన తర్వాత కూడా జగన్ తన సామాజిక వర్గానికే ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా రాజ్యసభ, లోక్‌సభ, పార్లమెంటరీ పార్టీ నాయకుల నియామకంలోనూ జగన్ మరోసారి తప్పటడుగు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ పక్ష నేతగా మిథున్‌రెడ్డి, రాజ్యసభ పక్ష నేతగా విజయసాయిరెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. తన సామాజిక వర్గానికే చెందిన ముగ్గురు ఎంపీలకు కీలక పదవులు అప్పగించారు. దీంతో మిగిలిన సామాజిక వర్గాలు వైసీపీని ఎందుకు పట్టించుకుంటాయనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
పవర్ మొత్తం తన సామాజిక వర్గం గుప్పిట్లోనే ఉండాలనేలా ప్రవర్తించిన జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. అయినా జగన్ తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకుల కారణంగానే పార్టీలోని ఇతర నేతలకు, ప్రజలకు జగన్ దూరమయ్యారనే అభిప్రాయాలున్నాయి. కానీ జగన్ ఈ నిజాన్ని తెలుసుకోవడం లేదు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూ మరింత దిగజారుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates