10 నిమిషాలు.. జగన్ బాబుని చూసి నేర్చుకోవాలి

రాజ‌కీయాల‌కు.. మీడియాకు అవినాభావ సంబంధం. నేత‌లు ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలన్నా.. మీడియానే వార‌ధి. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారికి మీడియా మ‌రింత స్నేహంగా ఉండాలని కోరుకుంటారు.

కానీ, వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. సీఎంగా జ‌గ‌న్ ప‌దినిమాషాల స‌మ‌యం మీడియాకు వెచ్చించలేక పోయారు. ఫ‌లితంగా.. ఆయ‌న త‌న‌పై వ‌చ్చిన వ్య‌తిరేక వార్త‌ల‌ను కూడా ఖండించుకునే ప‌రిస్థితి.. త‌మ మ‌న‌సులో ఏముందో ప్ర‌జ‌ల‌కు చెప్పే అవ‌కాశం కోల్పోయారు.

నిజానికి మీడియాకు.. స‌ర్కారుపై స‌ద‌భిప్రాయం ఏర్ప‌డాలంటే.. ముఖ్య‌మంత్రి త‌ర‌చుగా మీడియాతో సంభాషిస్తూ ఉండాలి. విష‌యం ఉన్నా.. లేకున్నా.. మీడియాను ఆహ్వానించి ముఖ్య‌మంత్రి మాట్లాడారంటే.. ఆ ప్ర‌భావం వేరేగా ఉంటుంది.

ఈ విష‌యంలో ప‌దినిముషాలు కూడా కేటాయించ‌నిజ‌గ‌న్‌కు ప‌దేళ్ల దెబ్బ వేసేసింది. కానీ, ఈ విష‌యంలో చంద్రబాబు ఎన్న‌ద‌గిన ప‌నిచేశారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రాత్రి పొద్దుపోయాక‌.. ఇంటికి వెళ్లిపోతున్న స‌మ‌యంలో మీడియా ప్ర‌తినిధులు ఆయ‌న‌కు క‌నిపించారు.

దీంతో ఇంటికి వెళుతున్నప్ప‌టి చంద్రబాబు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు. కారు దిగి ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులను స్వయంగా పలకరించారు.

సీనియర్ రిపోర్టర్లను పేర్లతో పలకరించి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆప్యాయంగా అడిగారు. ఈ ప‌రిణామం మీడియా ప్ర‌తినిధుల‌ను ముగ్ధుల‌ను చేసింది. దాదాపు ఐదేళ్ల తరువాత తాము సిఎంను కలిశామని….స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు.

రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉండే తాము గత 5 ఏళ్లుగా సిఎంను కనీసం కలవలేకపో యామని….పాలనా అంశాలపై కూడా మాట్లాడలేదని రిపోర్టర్లు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము 5 ఏళ్ల తరువాత సిఎంను కలిశామని నవ్వుతూ బ‌దులిచ్చారు. ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి వారితో అన్న‌ప్పుడు.. మ‌రింత సంతోషం వ్య‌క్తం చేశారు.

అయితే.. ఇక్క‌డ చంద్ర‌బాబు స్పెండ్ చేసింది కేవ‌లం 9-10 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే కానీ.. ఆయ‌న‌కు వ‌చ్చిన ప్ర‌చారం మాత్రం ప‌ది రోజుల‌పాటు ప‌దిలంగా ఉండేది. ఈ విష‌యంలో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. సొంత మీడియాకు కూడా ఆయ‌న అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.