ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పాలు పంచుకున్న జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. వీటిలోనూ కేవలం ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి కూడా.. ఆ పార్టీకే దక్కింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు గెలిస్తే చాలని అనుకున్న జనసేన పార్టీ.. ఆదిశగా తన ప్రచారం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ‘సీఎం-సీఎం’ అంటూ అరుపులు, కేకలు పెట్టినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సంయమనంతో వ్యవహరించారు. ముందు పార్టీని గెలిపించండి.. తర్వాత పదవు లు చూద్దామని చాలా విజ్ఞత, ఓర్పును ప్రదర్శించారు. అనుకున్నట్టుగా కాకుండా.. అమితంగానే ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన విజయ దుందుభి మొగించింది. ఈ పరిణామాలతో టీడీపీ అధినేత, కూటమి పార్టీల నాయకుడు చంద్రబాబు.. జనసేనకు ప్రాధాన్యం పెంచారు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోరికను ఆయన ఎలాంటి ప్రకటనలు చేయ కుండా తీర్చే ప్రయత్నం చేశారు. ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే.. నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. పవన్‌కు ఈ అవకాశం ఇచ్చారు.
తద్వారా.. జనసేన.. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ఆయన తన ఉదారతను, విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ పరిణామాలు.. జనసేనలోనూ టీడీపీపై ఆసక్తి నెలకొంది. తమకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారన్న టాక్ మరింత పెరిగింది. ఇదేసమయంలో పవన్‌ను నెంబర్ 2గా చూస్తున్నారని కూడా జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫలితాలు వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు జనసేన వర్గాలు హ్యాపీగానే ఉన్నాయి. ఇదిలావుంటే.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్‌కు ఎలాంటి అధికారాలు దక్కుతాయనేది చర్చ.
ఇవీ.. పవన్‌కు దక్కే అధికారాలు
- ముఖ్యమంత్రి తర్వాత.. పవన్ మాటకు అధికార వర్గాల్లో వాల్యూ పెరుగుతుంది.
- కీలక నిర్ణయాల్లో చంద్రబాబు డిప్యూటీ సీఎంను సంప్రదించే అవకాశం ఉంది.
- ప్రొటోకాల్ ప్రకారం ఇతర మంత్రుల కంటే ముందే పవన్‌కు గౌరవం, మర్యాద లభిస్తాయి.
- నిధుల కేటాయింపులోనూ ముందు డిప్యూటీ సీఎం శాఖలకు కేటాయించే చాన్స్ ఉంది.
- ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఏదైనా కారణంతో విధులకు హాజరు కాకపోతే.. తదుపరి నిర్ణయాలు డిప్యూటీ సీఎం నుంచే వెలువడనున్నాయి.
- పోలీసుల గౌరవ వందనం నుంచి అధికారుల నిర్ణయాల వరకు ముఖ్యమంత్రి తర్వాత.. డిప్యూటీ సీఎంకు దక్కుతాయి.