ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరంతా కూడా టీడీపీ నుంచి విజయం దక్కించుకున్నవారే కావడం గమనార్హం. అయితే.. తాజాగా వారికి కేటాయించిన శాఖలను చూస్తే.. చంద్రబాబు వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలుస్తుంది. అత్యంత కీలకమైన పదవులను మహిళా నేతలకు ఆయన కట్టబెట్టారు.
వంగలపూడి అనిత: విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఈమె పార్టీలో కీలక నాయకురాలు. ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమెకు చంద్రబాబు ఏకంగా.. హోం శాఖను అప్పగించారు. అదేవిధంగా విపత్తు నిర్వహణ శాఖను కూడా ఆమెకే అప్పగించారు. ఫైర్ డిపార్ట్‌మెంటును కూడా.. ఆమెకు ఇచ్చారు. కీలకమైన జైళ్ల శాఖను కూడా ఇచ్చారు. ఈ నాలుగు కూడా.. ప్రాధాన్యం ఉన్నవే కావడం గమనార్హం.
గుమ్మడి సంధ్యారాణి: విజయనగరం జిల్లా సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమ శాఖ అప్పగించారు. అదేవిధంగా గిరిజన అభివృద్ధి శాఖలను కూడా అప్పగించారు. గతంలో రెండు వేర్వేరుగా ఉండేవి. అయితే.. ఇప్పుడు సంధ్యారాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో రెండు శాఖలను కూడా ఆమెకే అప్పగించడం విశేషం.
సవిత: తొలిసారి విజయం దక్కించుకున్న ఎస్. సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుక బడిన వర్గాల వారి సంక్షేమం, హస్తకళలు, చేనేత శాఖలను అప్పగించారు. వీటిలో బీసీ సంక్షేమం అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. కురబ సామాజిక వర్గానికి చెందిన సవిత ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు.
కొసమెరుపు: మహిళా మంత్రులకు ఏదో ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా.. చంద్రబాబు బలమైన శాఖలను.. బాధ్యతలను కూడా అప్పగించడం విశేషం.