కేటీఆర్ ఎక్క‌డ‌? ఎందుకీ సైలెన్స్‌?

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్క‌డ‌? ఇప్పుడు ఈ ప్ర‌శ్న హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కేటీఆర్ ప‌త్తా లేకుండా పోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా ద‌క్క‌ని విష‌యం తెలిసిందే. సున్నా సీట్ల‌తో ఆ పార్టీ ఉనికి మ‌రింత ప్ర‌మాదంలో పడింది. ఈ సమ‌యంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మిపై స‌మీక్ష‌లు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త కేటీఆర్‌దే. అలాగే పార్టీ నాయ‌కుల్లోనూ, కార్య‌క‌ర్త‌ల్లోనూ స్థైర్యం నింపాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ కేటీఆర్ మాత్రం ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు.

అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాభ‌వాల‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే కొంత‌మంది బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

మ‌రికొంద‌రు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లాల‌ని చూస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో యాక్టివ్‌గా ఉంటూ పార్టీ నాయ‌కుల‌ను ఆపాల్సింది పోయి కేటీఆర్ సైలెంట్ అయిపోవ‌డం ఏమిట‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు ఆయ‌న పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంటేనా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఆ బాధ్య‌త‌ల‌ను వేరొక‌రికి అప్ప‌జెప్పాల‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలే అంటున్నాయి.

కొన్ని రోజులుగా తెలంగాణ భ‌వ‌న్‌కు కూడా కేటీఆర్ రావ‌డం లేదు. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేరు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటుతామ‌ని బీరాలు ప‌లక‌డంతో ఇప్పుడు అవ‌మాన భారంతో ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కూ దూరంగా ఉన్న కేటీఆర్ విదేశాల‌కేమైనా వెళ్లారా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఫోన్ ట్యాపింగ్‌, గొర్రెల స్కామ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు.. ఇలా బీఆర్ఎస్‌లోని పెద్ద త‌ల‌కాయ‌ల చుట్టూ గ‌ట్టిగానే ఉచ్చు బిగుస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ సైలెన్స్ హాట్ టాపిక్‌గా మారింది.