టీడీపీ కుటుంబాల్లో ఈ కుటుంబం వెరీ వెరీ స్పెష‌ల్‌..!

తెలుగు దేశం పార్టీలో కొన్నిద‌శాబ్దాలుగా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల, రాజ‌మండ్రికి చెందిన బుచ్చ‌య్య‌, అనంత‌పురానికి చెందిన ప‌రిటాల, ఉమ్మ‌డికృష్ణాకు చెందిన దేవినేని, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన పూస‌పాటి వంటి అనేక కుటుంబాలు పార్టీలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. పోషించాయి కూడా.

అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా.. ఆయా కుటుంబాలు రాజ‌కీయంగా టీడీపీని బ‌లోపేతం చేశాయి. అయితే.. ఏ కుటుంబానికీ.. ద‌క్క‌ని అరుదైన గౌర‌వం.. మాత్రం ఒకే ఒక్క కుటుంబానికి ద‌క్కింది. ఇత‌ర రాజ‌కీయ కుటుంబాలు అసూయ చెందేలా ఆ కుటుంబానికి పార్టీలో ఎనలేని ప్రాధాన్యం కూడా ద‌క్కుతోంది.

దీనికి ప్ర‌ధానంగా క‌లిసి వ‌స్తున్న కార‌ణం.. పార్టీ విష‌యంలో పూర్తిస్థాయి నిబ‌ద్ధ‌త‌తో పాటు..సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ఈ కుటుంబానికి పెద్ద ఎత్తున అండ‌దండ‌లు ఉండ‌డం. వీటితోపాటు.. పార్టీ క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు కూడా.. పార్టీలోనే ఉండ‌డం వంటివి ఎక్కువ‌గా క‌లిసివ‌స్తున్నాయి. ఆ కుటుంబ మే కింజ‌రాపు ఫ్యామిలీ.

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడితో ప్రారంభ‌మైన రాజ‌కీయ ప్ర‌స్తానం.. ఇప్పుడు ఇంతింతై.. అన్న‌ట్టు గా అటు పార్టీలోనూ.. ఇటు జిల్లాలోనూ ఎన‌లేనిపేరు తెచ్చుకుంది. కార్మిక సంఘం నాయ‌కుడిగా ఉన్న ఎర్ర‌న్నాయుడును అన్న‌గారు ఎన్టీఆర్ టీడీపీలోకి తీసుకున్నారు. ఏ ముహూర్తాన ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించారో.. అప్ప‌టి నుంచి ఎప్ప‌టికీ వెనుదిరిగి చూసుకోలేనంతగా.. టీడీపీ ప్రాదాన్యం ఇచ్చింది.

మ‌ధ్యలో 1995లో పార్టీ ప‌గ్గాలు మారిన‌ప్ప‌టికీ.. ఎర్ర‌న్న కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యం త‌గ్గ‌లేదు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కొన్ని కుటుంబాల‌కు త‌ర్వ‌త కాలంలో ప్రాధాన్యం త‌గ్గింది. కానీ, ఎర్ర‌న్న మాత్రం అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇదే ఆయ‌న‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌, పార్టీలోనూ కూడా.. మెజారిటీ మ‌ద్ద‌తు ల‌భించేలా చేసింది. ఎర్ర‌న్న హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత కూడా.. ఆ కుటుంబానికి టీడీపీ అండ ల‌భించేలా చేసింది. ప్ర‌స్తుతం ఎర్ర‌న్న కుటుంబ‌లో ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇలా.. మూడు ప‌ద‌వులు వ‌రించాయి. దీనికి మించి రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా కూడా.. ఎర్ర‌న్న సోద‌రుడే ఉన్నారు.

నిజానికి ఒకే కుటుంబానికి ఇన్ని ప‌ద‌వులు ద‌క్క‌డం.. ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌డం అనేది.. టీడీపీలో ఇదే తొలిసారి అని చెప్పుకోవ‌చ్చు. నందమూరి, నారా కుటుంబాల్లో మాత్ర‌మే సాధ్య‌మ‌వుతున్న ఈ ధోర‌ణి కేవ‌లం కింజ‌రాపు కుటుంబానికే మ‌ళ్లీ సాధ్య‌మైంది.

అచ్చెన్నాయుడు మంత్రిగా, రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా, రామ్మోహ‌న్ నాయుడు కేంద్ర మంత్రిగా, అల్లుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో.. విధేయ‌త‌, మంచిత‌నం, పార్టీ ప‌ట్ల అంకిత భావం.. అధినేత ప‌ట్ల గౌరవం వంటివి కింజ‌రాపు కుటుంబానికి అండ‌గా మారాయ‌ని అన‌డంలో సందేహం లేదు.