ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నట్టు తెలిసింది.
ఇక, రాష్ట్రంలో హిందూ ఓటు బ్యాంకును తన పార్టీవైపు మలుచుకునేందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకుకూడా వ్యూహాత్మకంగా సోము అడుగులు వేస్తున్నారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రయత్నం చేస్తున్న తీరును, ప్రయత్నాన్ని కూడా ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
ఇక, ఇప్పుడు హల్‌చల్ చేస్తున్న టాపిక్ ఏంటంటే.. ఏపీ బీజేపీలో ఘర్ వాపసీ నినాదం ఇవ్వాలని సోము నిర్ణయించుకోవడమే! అంటే.. అనేక కారణాలతో పార్టీని విడిచి పెట్టి వెళ్లిన సీనియర్లు, యాక్టివ్‌గా లేని నాయకులకు పునర్ వైభవం ఇవ్వాలని సోము నిర్ణయించుకున్నారట.
నిజానికి ఒక్క కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరంలో తప్పితే.. మిగిలిన జిల్లాల్లో బీజేపీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంది. గతంలో నాయకులు అనేక నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున గెలుపు గుర్రాలు కూడా ఎక్కారు. విజయవాడ సెంట్రల్‌లో కోట శ్రీనివాసరావు, కైకలూరులో కామినేని శ్రీనివాస్, పశ్చిమలోని తాడేపల్లిగూడెంలో దివంగత మాణిక్యాలరావు, విశాఖ ఎంపీ స్థానం నుంచి కంభంపాటి హరిబాబు, రాజమండ్రి సిటీ నుంచి ఆకుల సత్యనారాయణ ఇలా.. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గతంలో గెలుపు గుర్రం ఎక్కింది.
అయితే, కారణాలు ఏవైనా.. ఇప్పుడు సీనియర్ నాయకులు కొందరు స్తబ్దుగా ఉండగా.. మరికొందరు పార్టీలు కూడా మారిపోయారు. ఇంకొందరు పార్టీలోకి వచ్చారు. వారిలో ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, సుజనాచౌదరి, అన్నం సతీష్ ప్రభాకర్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. వీరిని వాడుకుంటూనే.. మరోపక్క, వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే.. బీజేపీ బలోపేతం అవడం ఖాయమని అనుకుంటున్నారట సోము. పైగా వచ్చే ఎన్నికల నాటికి వ్యూహం మారి.. ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా.. వెతుకులాట లేకుండా నేతలను తయారుచేసుకునేందుకు కూడా ఈ వ్యూహం పనికి వస్తుందని భావిస్తున్నారు.
మంచిదే. వ్యూహం బాగుంది. సోమును తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, గతంలో బీజేపీ సారథిగా ఉండి.. అన్ని వర్గాలకూ తలలో నాలుకగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. అయితే.. అప్పట్లో ఏ ఒక్కరూ కలిసిరాలేదు. మరి అలాంటి ఫైర్‌బ్రాండ్‌గా.. పైగా కమ్మవారికి ప్రాధాన్యం ఇవ్వరనే పేరున్న సోము వీర్రాజు వేసిన వ్యూహానికి ఏమేరకు మద్దతు లభిస్తుంది. ఘర్ వాపసీ ఏమేరకు సక్సెస్ అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే ఇప్పుడు పార్టీలో హల్‌చల్ చేస్తున్న హాట్ టాపిక్. చూడాలి మరి సోము ఎలా దూసుకుపోతారో..!!