‘నామా’కు టీడీపీ ప‌గ్గాలు?

తెలంగాణలో టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈ విష‌యంపైనా దృష్టి పెట్టారు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో అక్క‌డ కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. క్ర‌మంలో ఆయ‌న తెలంగాణ‌కు అధ్య‌క్షుడిని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. గ‌తంలో ప‌నిచేసిన కాసాని జ్ఞానేశ్వ‌ర్‌.. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోయారు.

దీంతో పార్టీకి అధ్య‌క్షుడు లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డంతో ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ స‌మ‌యంలోనే పార్టీని ముందుకు తీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు.. ఖ‌మ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వ‌ర‌రావును పార్టీలోకి తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంపై కీల‌క నాయ‌కులు గ‌త రెండు రోజులుగా నామాతో చ‌ర్చ‌లు కూడా చేస్తున్న‌ట్టు తెలిసింది. గ‌తంలో టీడీపీలోనే ప‌నిచేసిన నామా.. ఇప్పుడు బీఆర్ ఎస్‌లో ఉన్నారు.

పార్ల‌మెంటు ఎన్నికల్లో ఆయ‌న ఓడిపోయారు. దీంతో ఆయ‌న‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి.. రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్ప‌గించే దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు. పారిశ్రామిక వేత్త అయిన‌.. నామా అయితే.. రాష్ట్రంలో పారిశ్రామిక వ‌ర్గాల‌ను కూడా ఆక‌ర్షించేందుకు అవ‌కాశం ఉంటుంది. అదేస‌మయంలో బీఆర్ ఎస్ నుంచి కూడా.. నామా వ‌ర్గం టీడీపీలోకి చేరే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేసుకుంటున్నారు.

గతంలో తెలుగుదేశం మాజీ నాయకులతో నిండిపోయిన బీఆర్ ఎస్‌ పార్టీ….ఇప్పుడు పతనం అవ్వడంతో తిరిగి తెలుగుదేశంలోకి చేరేందుకు మాజీ మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ స‌హా మాజీ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరికి చంద్ర‌బాబు ఏపీలో అధికారంలోకి రావ‌డం క‌లిసి వ‌స్తున్న ప‌రిణామం. త‌ద్వారా.. త‌మ వ్యాపారాలు వ్య‌వ‌హారాలు కూడా తెలంగాణ‌లో పుంజుకుంటాయ‌ని భావిస్తున్నారు. బీఆర్ ఎస్‌ను న‌మ్ముకుంటే.. వ‌చ్చే ప‌దేళ్లు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. అందుకే.. టీడీపీ వైపు మెజారిటీ నాయ‌కులు చూస్తున్నారు.