నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయంతో అధికారంలోకి రావడం ఆలస్యం.. ప్రతిపక్ష పాత్రలోకి మారిన వైసీపీ టార్గెట్ ఏంటో స్పష్టం చేసేసింది.
చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చూడాలని.. కాని పక్షంలో దాని మీదే రాజకీయం చేయాలని వైసీపీ మద్దతుదారులు ఫిక్సయిపోయారు. నిజానికి దానికి మించిన రాజకీయ ఎజెండా కూడా ఆ పార్టీకి ఏమీ లేదు.
టీడీపీ వాళ్లు చేస్తున్న ప్రతీకార దాడుల మీద కూడా ఎక్కువ రోజులు రాజకీయం నడిపే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో అందరికీ తెలుసు.
అప్పుడు టీడీపీ వాళ్ల గోడును ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్లదీ అదే పరిస్థితి. అందుకే కొత్త ప్రభుత్వం హామీలు నెరవేర్చడం మీద ఫోకస్ చేయడానికి వైసీపీ సైన్యం సిద్ధమైపోయింది.
కానీ అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెడతానన్న చంద్రబాబు.. ప్రమాణ స్వీకారం రోజు ఆ పని చేయలేదంటూ ఒక రోజంతా గగ్గోలు పెట్టారు. కానీ బాబు తర్వాతి రోజే ఆ పని చేసేశారు. దీంతో వైసీపీ వాళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. కానీ వాళ్లేమీ రాజకీయం ఆపలేదు.
మెగా డీఎస్సీ అని చెప్పి 16 వేల ఉద్యోగాల భర్తీనే చేయబోతున్నారని.. రాష్ట్రంలో 50 వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉంటే, 16 వేలు మాత్రమే భర్తీ చేస్తారా అంటూ గొడవ మొదలుపెట్టారు. కానీ ఒకేసారి 16 వేల టీచర్ పోస్టుల భర్తీ అంటే చిన్న విషయం కాదు. ఇది కచ్చితంగా పెద్ద నంబరే. ఇది నిజంగా ‘మెగా’ డీఎస్సీనే.
ఒకేసారి 50 వేల టీచర్ పోస్టుల భర్తీ అంటే అసాధ్యమైన విషయం. ఒకవైపు ఐదేళ్ల వ్యవధిలో అసలు డీఎస్సీనే ప్రకటించకుండా ఒక్క పోస్టు భర్తీ చేయకుండా కాలం గడిపేసింది జగన్ సర్కారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్కసారిగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే అందరికీ జగన్ వైఫల్యం గుర్తుకొస్తుంటే.. వైసీపీ వాళ్లు మాత్రం ఆ వైఫల్యాన్ని మరిచిపోయి బాబు నెరవేరుస్తున్న హామీలో లోపాలు వెతకడం విడ్డూరం.