వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై నిత్యం సటైర్లతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను ఎట్టి పరిస్థితిలోనూ జగన్ గురించి మాట్లాడబోనని అన్నారు. ఆయనపై సటైర్లు కూడా వేయబోనని తేల్చి చెప్పారు.
“జగన్ గురించి మాట్లాడను. ఆయనను అనుకరించను. ఆయన గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్“ అని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ.. జగన్ గురించి ఇప్పటి వరకు మాట్లాడిన వన్నీ జనం నిజమేనని నమ్మారని.. అది తనకు సంతృప్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
అయితే.. ఇప్పుడు బలమైన ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా.. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని.. అందుకే వేస్ట్ పర్సన్(జగన్ వైసీపీ నాయకులు) గురించి ఇక నుంచి మాట్లాడబోనని రఘురామ తేల్చి చెప్పారు. జగన్ చేయాల్సింది చేశాడని.. ఆయన చేసింది మంచో.. చెడో ఏదో జరిగిపోయిందని ఇక, జగన్‌ను కూడా.. ప్రజలు పట్టించుకోరని తాను భావిస్తున్నానని చెప్పారు.
ఈ నేపథ్యంలో అనవసరంగా జగన్ గురించి టైమ్ వేస్టు చేసుకునే ప్రసక్తి ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రజల దృష్టంగా.. చంద్రబాబు ఆయన ప్రభుత్వంపైనే ఉందన్నారు. దీనిలో తన పాత్ర కూడా ఉంటుందన్నారు.
తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామా? లేదా? అనే విషయంపై ప్రజలు ఎక్కువగా చూస్తున్నారని.. అందుకే.. ఇక నుంచి ప్రభుత్వ విధానాలను తాను మాట్లాడతానని రఘురామ తెలిపారు. జగన్ హయాంలో తనపై పోలీసులు చేసిన టార్చర్‌ను న్యాయపరంగా.. చట్టం పరంగా తేల్చుకుంటానని చెప్పారు.
అందుకే ఆనాటి దాడికి సంబంధించి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు.దీనిపై పోలీసులుతనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని.. లేక పోతే కోర్టులు ఎలానూ ఉన్నాయని తెలిపారు. ఎక్కడో ఒక చోట న్యాయం అయితే జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates