తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పును సరిగ్గా తన అభిప్రాయాలకు తగిన విధంగానే ఏర్చి, కూర్చుకున్నారు. కూటమిలోని ఇతర పార్టీల విషయాన్ని పక్కన పెడితే.. టీడీపీ నుంచి తీసుకు న్న 20 మంది నాయకుల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విధేయతకు వీరతాడు వేసే పరిస్థితి నుంచి విధేయతతోపాటు.. కష్టపడే తత్వం వంటివాటికి చంద్రబాబు ఈ సారి తన మార్కు చూపించారు.
- ఉత్తరాంధ్రకు చెందిన వారిలో అచ్చెన్నాయుడు.. మరోసారి మంత్రి పీఠం దక్కించుకున్నారు. ఈయనకు విధేయతతో పాటు.. పోరాట పటిమ కూడా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తరాంధ్ర నేతల్లోనూ ఈయనకు మంచి పేరుంది.
- మచిలీపట్నం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకుని మంత్రి వర్గంలో సీటు కొట్టేసిన కొల్లు రవీంద్ర కూడా..పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల విధేయులే. అదేసమయంలో పార్టీ కోసం ఉద్యమించడం కూడా కలిసి వచ్చింది.
- రేపల్లె నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టిన అనగాని సత్యప్రసాద్ కు చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు పెట్టారు. ఈయన ఈ పదవికి సంపూర్ణంగా అర్హులనే టాక్ సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇక, వైసీపీ నుంచి మంత్రి పదవి ఆఫర్ వచ్చినప్పటికీ ఈయన ఆ పార్టీవైపు మళ్లకుండా పార్టీలోనే ఉన్నారు. అసెంబ్లీలోనూ వైసీపీని ఇరుకున పెట్టారు.
- వరుస విజయాలతో దూసుకుపోయిన కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామికి కూడా చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా.. సేమ్.. కృషి+విధేయతలు.. ఆయనను మంత్రి పీఠం ఎక్కించాయి. వృత్తి రీత్యా వైద్యుడైన డోలా.. తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు. వరుస విజయాలు దక్కించుకున్నారు.
- వంగల పూడి అనిత.. పార్టీ పట్ల అంకిత భావంతో ఎదిగిన నాయకురాలు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈమెకు చంద్రబాబు పదవి ఇచ్చారు. ఆది నుంచి కూడా విధేయత, కృషి వంటి విషయాల్లో అనిత మంచి పేరు తెచ్చుకున్నారు. అధినేత పట్ల విధేయత ఆమె డైయిరీలో ప్రత్యేకంగా ఉన్న పేజీ.
- పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న నిమ్మల రామానాయుడు.. గత ఐదేళ్ల కాలంలో పోరాడిన తీరు.. పార్టీని స్థానికంగా నడిపించిన తీరు నభూతో అన్నవిధంగా సాగింది. ఈయనకు కూడా.. చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే.. కష్టపడేవారికి టీడీపీలో స్థానం చెక్కుచెదరదు అని నిరూపించేందుకు నిమ్మల నియామకమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.