కేంద్రంలో మంత్రి పదవి అంటే చాలా కీలకంగా భావిస్తారు. జాతీయ రాజకీయాల్లో ఉన్నవారు.. లేదా ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలో మంత్రులుగా ఉండాలని కోరుకుంటారు. కనీసం.. సహాయ మంత్రి అయినా ఫర్వాలేదు .. అనుకుంటారు. గతంలో ఓ కీలక పార్టీ జాతీయ పార్టీలో విలీనం అయినప్పుడు కూడా సదరు నాయకుడు మంత్రి పదవినే కోరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవులకు డిమాండ్ కూడా ఉంటుంది.
తాజాగా ఏపీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. వీరిలో ఇద్దరు టీడీపీ నాయకులు, మరొకరు బీజేపీ నాయకుడు. వీరిలోనూ ఇద్దరు తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన వారు కావడం గమనార్హం. మరొకరు మాత్రం వరుసగా మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరి వీరికి ఇచ్చిన పదవులు.. వారు ఏపీకి చేసే మేళ్లు ఏంటి? అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అవేంటో చూద్దాం..
కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన శ్రీకాకుళం నుంచి టీడీపీ టికెట్‌పై 2014 ఎన్నికలనుంచి వరుసగా గెలుస్తున్నారు. తాజాగా ఆయనకు మోడీ సర్కారులో పౌర విమానయాన శాఖ లభించింది. ఇది జాతీయ స్తాయిలో మెన్నదగిన పదవే కానీ.. రాష్ట్ర స్థాయిలో పెద్దగా ఈ పదవి వల్ల ఒరిగేది ఉండనేది నిజం. ఒకవేళ ఉన్నా.. కేవలం విమానాశ్రాయాల్లో మౌలిక సదుపాయాలు, భోగాపురం, కడప, గన్నవరం, విశాఖ వంటి విమానాశ్రయాలను మెరుగు పరిచేందుకు మాత్రమే ఆయన సేవలు ఉపయుక్తంగా మారతాయి.
పెమ్మసాని చంద్రశేఖర్: ఈయన తొలిసారి గుంటూరు పార్లమెంటుస్థానం నుంచి టీడీపీ టికెట్పై విజయం దక్కించుకున్న ఎన్నారై నాయకుడు. ఈయనకు సహాయ మంత్రి పదవి లభించింది. ఈయనకు గ్రామీణా భివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిత్వ శాఖ దక్కింది. ఇది కొంత మేరకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజధాని నిర్మాణంలో కొంత మేరకు.. నగర , పట్టణాభివృద్ధి విషయంలో బలమైన సిఫారసులు చేసేందుకు అవకాశం ఉంది. ఇక, సమాచార రంగంలో ఫైబర్ నెట్ను తిరిగి తీసుకురానున్న నేపథ్యంలో పెమ్మసాని సేవలు కీలకంగా మారనున్నాయి. అయితే.. ఇవి మళ్లీ ఆయాశాఖలకు మంత్రిగా ఉన్నవారి ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది.
భూపతి రాజు శ్రీనివాసవర్మ: ఈయన బీజేపీ నుంచి తొలిసారి నరసాపురంలో విజయం దక్కించుకున్నారు. ఈయనకు కూడా సహాయ మంత్రి పదవి ఇచ్చారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలకు ఆయన సహాయ మంత్రిగా వ్యవహరిస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఏపీ కోరికలను ఆయన వినిపించే అవకాశం ఉంది. అయితే.. బీజేపీ నాయకుడు కావడంతో ఏమేరకు ఆయన పని తనం ఉంటుందనేది చూడాలి. ఇక, భారీ పరిశ్రమల అభివృద్ధికి కొంత మేరకు ఆయన సాయం చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. కేబినెట్ ర్యాంకు కాకపోవడంతో ఈయన చేసే మేళ్లు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates