టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగింది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును మూడు పార్టీల నేతలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం జరింగింది.
చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. తనను ఎన్డీఏ తరపున శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన శాసన సభాపక్ష సమావేశం ఈ ఎన్నిక జరిగింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వారితో చర్చించారు. అధిష్ఠానం ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.