ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్ఫూర్తిదాయకమైన తీర్పును ఇచ్చారని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం చంద్రబాబును.. ఎన్డీయే కూటమి పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనను కోరుకున్నారని, కానీ ఎలాంటి పాలన అందించారో. గత పాలకుడి గురించి తెలిసిందేనని అన్నారు.
అలాంటి దుర్మార్గపు పాలన తమకు అవసరం లేదని.. ప్రజలు తీర్పు చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఒకరకంగా ఈ ఎన్నికల విజయం ఓ కేస్ స్టడీ అని భావిస్తున్నట్టు తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు.. దాడులు చేసినందున ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో సొంత పార్టీ నాయకులకు కొన్ని కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు టీడీపీ కూటమి నేతలు కూడా కక్ష తీర్చుకోవాలని చూస్తే.. మనకు కూడా ఇబ్బంది తప్పదని హెచ్చరించారు.
అయితే.. తప్పు చేసిన వారి విషయంలో మాత్రం క్షమించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలి పెడితే.. అదే అలవాటుగా మారుతుందని, కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, విధ్వంసకర రాజకీయాలు, కక్ష పూరిత రాజకీయాలను ప్రక్షాళన చేయనున్నట్టు చెప్పారు. ఎవరూ కూడా తొందర పాటు చర్యలకు దిగకూడదని.. ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates