జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక నుంచి పూర్తిస్థాయి రాజకీయాలే చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా ఆయనను జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ తరఫున ఎన్నికైన 20 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు
అయితే.. ఒక పార్టీకి శాసన సభా పక్షనాయకుడిగా ఉన్న నేత పూర్తిస్థాయిలో సమయం వెచ్చించాల్సి ఉం టుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ ప్రాధాన్యం ఉంటుంది. అదేవిధంగా పార్టీ నేతలను కూడా సమన్వయ పరచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తీసుకునే ఈ బాధ్యతలను బట్టి చూస్తే.. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టుతెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఆయన కొన్ని సినిమాల్లో ఒప్పుకొని ఉన్నారు. మరి వాటిని ఎలా పూర్తి చేయనున్నారో చూడాలి.
చంద్రబాబుకు మద్దతు
కూటమి పార్టీల తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీయే పార్టీలపక్షాన తరఫున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. అనంతరం.. చంద్రబాబు.. పవన్‌ను ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి కూడా.. బీజేపీ తరఫున తాము కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.