ఏం బిజీ అండీ బాబూ! అన్నట్టుగానే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ పరిస్థితి. నిన్నటి వరకు కేంద్రంలో కుస్తీ.. తర్వాత రామోజీ ఫిలింసిటీలోనే రెండు రోజులు.. ఇప్పుడు ఏపీలో అడుగు పెట్టా రో లేదో వెంటనే మరోసారి బిజీ బిజీ. ఈ సారి అంతా ఇంతా కాదు. ఏకంగా కూడికలు -తీసివేతలతో ఆయన లెక్కల మాస్టారిని తలపిస్తున్నారు. కాలిక్యులేషన్‌లో కొత్త ఒరవడి చూపిస్తున్నాయి. మరి ఈ లెక్కల సంగ తేంటి? అనే సందేహం వస్తుంది.
ఈ నెల 12న.. చంద్రబాబు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే.. ఆయనతో పాటు పలువురు మంత్రులను కూడా తీసుకోవాలి. తీసుకుంటున్నారు కూడా. లెక్క ప్రకారం.. 25 మంది మంత్రుల వరకు ఉండే అవకాశం ఉంది. తొలి రోజే ఇంత మందిని తీసుకోవాలని అనుకున్నా.. ఎందుకో కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ముందు తనతోపాటు.. మరో 10 మంది వరకు కన్ఫర్మ్ చేసుకుంటారని.. తర్వాత మరో విడతలో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని తెలుస్తోంది.
అయితే.. ప్రస్తుతం మాత్రం మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే వారి సంఖ్య 50 వరకు ఉంది. వీరిలో కీలక నాయకులు.. సామాజిక వర్గాలు.. బంధువులు.. మొహమాటాలు.. ఇలా అనేక రూపాల్లో చంద్రబాబు కు పెద్ద పరీక్షగా మారింది. ఇప్పటికే రెండు రూపాల్లో నివేదికలు రెడీ చేసుకున్నారు. ముందుగానే రాసిపెట్టుకున్న జాబితా ఒకటైతే.. మరో రెండు నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రూపొందించిన నివేదికలు. వీటినుంచి ఇప్పుడు చంద్రబాబు కూడికలు – తీసివేతలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. ఎంతైనా వేడి ఉన్నప్పుడే.. అన్నట్టుగా నాయకులు మాత్రం త మ తమ ప్రయత్నాలు చేస్తున్నా రు. చంద్రబాబు ఇలా వచ్చారని తెలిసిందో లేదో.. నాయకులు ఉండవల్లి నివాసానికి పోటెత్తారు. దీంతో గుంటూరు నగర శివారు.. మొత్తం టీడీపీ నాయకుల వాహనాలతో జోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ తమ చిట్టాలు పట్టుకుని, పెరర్ఫామెన్స్ సర్టిఫికెట్లు పట్టుకుని రెడీ అయ్యారు. మరి చంద్రబాబు ఎవరిని కరుణిస్తారో చూడాలి. మొత్తం మంత్రి పదవుల్లో 18 వరకు టీడీపీ తీసుకునే అవకాశం ఉంది.