ఈ నెల 12న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ లోగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అన్ని పర్యటనలు ముగించుకుని ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు విషయంపై దృష్టి పెట్టారు. ప్రభుత్వంలో మంత్రి పదవుల కూర్పు.. సహా ఇతర విషయాలపై ఆయన దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో తాజాగా ఉత్తరాంధ్రలో పవన్ పర్యటించారు. అయితే.. ఇది రాజకీయ పర్యటనలా కాకుండా.. ఆద్యాత్మిక పర్యటన కావడం విశేషం. ఉత్తరాంధ్రులు ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అనకాపల్లి ప్రచారంలో భాగంగా గెలుపు తర్వాత అనకాపల్లి నూకాంబిక దర్శించుకుంటానని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలోనే ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు. ఆ మాట ప్రకారం సోమవారం అనకాపల్లిలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. తలకు పాగాకట్టుకుని సంప్రదాయ వస్త్రాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిమానులు నూకాంబిక చిత్రపటం ఇచ్చి పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమం లో కూటమి పార్టీల నేతలు.. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలయ ప్రాంగణంలో జై పవన్, జై బాబు అని నినాదాలు చేశారు. అయితే.. ఆలయాలను రాజకీయం చేయొద్దంటూ.. పవన్ సూచించడంతో వారంతా మౌనం పాటించారు. అనంతరం.. విజయవాడకు బయలు దేరి వచ్చారు. కాగా, మంగళవారం.. కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై చంద్రబాబు, బీజేపీ నేతలతో పవన్ భేటీ అయి చర్చించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates