సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లో హరీష్ శంకర్ ఒకడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి హరీష్ అస్సలు మొహమాట పడడు. ఈ మధ్య బాలీవుడ్ సోకాల్డ్ ‘లిబరల్స్’ మీద హరీష్ ఎలా పంచులు వేశాడో తెలిసిందే.
మైనారిటీలకు వ్యతిరేకంగా ఏం జరిగినా గళం విప్పే ఈ సూడో సెక్యూలరిస్టులు.. ఇటీవల మహారాష్ట్రలో సాధువుల్ని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు మాట్లాడలేదంటూ హరీష్ శంకర్ నిలదీశాడు. అనురాగ్ కశ్యప్ సహా కొందరు లిబరల్స్ ఇప్పుడేమయ్యారంటూ వాళ్ల ఫొటోలు పెట్టి మరీ కౌంటర్లు వేశాడు. తాజాగా ‘ది ప్రింట్’ ఇంటర్నెట్ ఎడిషన్‌లో రాసిన ఓ వ్యాసం మీద హరీష్ శంకర్ మండిపడ్డాడు. అందులో అక్షయ్ కుమార్ గురించి చేసిన కామెంట్ హరీష్‌కు ఆగ్రహం తెప్పించింది.
బీజేపీ వాళ్లు భారతీయ పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీని ఇంకా ఇటాలియన్గానే చూస్తారని.. కానీ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్ కుమార్‌ను మాత్రం ఇండియన్‌గా గౌరవిస్తారని ఆ కథనంలో వ్యాఖ్యానించారు. దీనిపై హరీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇందులో అక్షయ్ గురించి వ్యాఖ్యలు చేశారని.. అక్షయ్ నిజంగా కెనడా వాసే అయినా తమకు అభ్యంతరం లేదని.. అతను ఈ దేశాన్ని ఏలాలని చూడట్లేదని.. కేవలం వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నాడని.. సంక్షోభాలు తలెత్తిన అనేక సందర్భాల్లో అక్షయ్ కోట్ల రూపాయలు సాయం చేశాడని.. మరి సదరు ‘మేడమ్’ ఏం చేసిందని హరీష్ ప్రశ్నించాడు.
ఇలాంటి పోలిక తీసుకురావడం సిగ్గు చేటని.. బీజేపీ మీద నిందలేయాలనుకుంటే వేయొచ్చని.. కానీ సినిమా వాళ్లను టచ్ చేసే సాహసం చేయొద్దని, తాము జనంతో ఉన్నామని అన్నాడు హరీష్. ఆయన ట్వీట్లకు జాతీయ స్థాయిలో నెటిజన్ల నుంచి గట్టి మద్దతే లభించింది.