తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఎప్పడూ హాట్ కేక్‌నే తలపిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తరఫున ఇక్కడ నామినేట్ అవుతారు.
ఈ సీటు కోసం.. కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా.. చాలా మంది ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూటమి పార్టీల్లోనే.. ఈ పదవి కోసం.. పోటీ ఏర్పడినట్టు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ రేసులో టీడీపీ నాయకుడు.. పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్‌వీఎస్ ఎన్ వర్మ పేరు జోరుగా వినిపిస్తోంది.
ఎన్నికలవేళ.. తన సీటును త్యాగం చేయడంతోపాటు.. చంద్రబాబు కోరిక మేరకు వర్మ వ్యవహరించారు. అయితే.. ఆయనకు మంత్రివర్గంలో సీటు ఇవ్వాలని ఉన్నా.. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు. మండలిలో సీట్లు ఖాళీ అయ్యేవరకు ఎదురు చూడాల్సి ఉంది.
దీంతో ఈలోగా.. వర్మ.. టీటీడ బోర్డు చైర్మన్ పదవి ని ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే.. ఆయన పవన్‌కు కూడా చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయనకు దాదాపు ఈ సీటు ఇచ్చే అవకాశం ఉంది.
ఇక, జనసేనలోనే మరో కీలక నాయకుడు, పవన్ సోదరుడు నాగబాబు… పేరు కూడా వినిపిస్తోంది. కానీ,.. ఆయన వ్యక్తిగత స్వభావానికీ.. టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవికి లింకు కుదరడం చాలా కష్టం.
దీంతో ఆయన దాదాపు ఈ పదవికి దూరంగానే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ ఇద్దరు కీలక నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఒకరు సోము వీర్రాజు. ఈయన పార్టీ హైకమాండ్‌కు ఇప్పటికే అర్జీ పెట్టుకున్నట్టు సమాచారం.
ఇక, మరోనేత.. తిరుపతికి చెందిన భానుప్రకాశ్ రెడ్డి. ఈయన తాజా ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ, బీజేపీ ఆయనకు ఇవ్వలేదు. పైగా.. దీనిని జనసేనకు వదిలేశారు. దీంతో ఇప్పుడు టీటీడీ పదవి రేసులో ఆయన జోరుగా ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి భర్త.. మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా.. స్వామి సేవలో తరించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే..ఈయన పెద్దగా పోటీ ఇవ్వడం లేదు. మొత్తంగా చూస్తే.. టీటీడీ పదవి కోసం.. జోరుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates