వాయిస్‌లో బేస్ ఎక్కడ నానీ?

2014-19 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చాలామంది ఎలా నోరేసుకుని ప్రతిపక్ష నేతల మీద పడిపోయారో తెలిసిందే. విమర్శలు అందరూ చేస్తారు కానీ.. మంత్రి స్థాయిలో ఉన్న వాళ్లు బూతులు మాట్లాడుతూ ప్రత్యర్థులకు సవాళ్లు విసరడం, బెదిరించడం వైసీపీ హయాంలో మాత్రమే చూశాం. ముఖ్యంగా అలా రెచ్చిపోయి మాట్లాడిన వాళ్లలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు.

తొలిసారి టీడీపీ టికెట్ మీదే గెలిచి ఎమ్మెల్యే అయిన ఆయన.. ఆ తర్వాత చంద్రబాబు, నారా లోకేష్‌లతో విభేదించి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి జగన్ వెంట నడిచారు. ఆ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐతే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును పట్టుకుని వాడు.. వీడు.. నా కొడుకు అంటూ ఎన్నిసార్లు బూతులు తిట్టారో లెక్కలేదు నాని.

మీడియా ముందుకు వచ్చాడంటే చాలు మైకుల తుప్పు వదిలిపోయేలా బూతులు అందుకునేవాడు నాని. ఐదేళ్లలో ఎన్ని సవాళ్లో.. ఎన్ని హెచ్చరికలో లెక్కే లేదు. అది వైసీసీ అభిమానుల్లో ఆయనకు ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. గుడివాడ టైగర్ అంటూ ఆయనకు ఎలివేషన్లు ఇచ్చేవాళ్లు. కానీ ఒక్కసారి వైసీసీ ఓడిందో లేదో.. నాని వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. గుడివాడలో తనకు తిరుగులేదన్నట్లు తొడగొట్టి మాట్లాడే నాని.. ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్ పూర్తి కాకముందే కౌంటింగ్ కేంద్ర నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఎక్కడా కనిపించలేదు.

తాజాగా వైసీపీ కార్యకర్తల మీద దాడులను ఖండిస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో నాని పాల్గొన్నారు. ఆ సందర్భంగా చాలా సౌమ్యంగా, బేలగా మాట్లాడాడు నాని. వాయిస్‌లో ఎప్పుడూ ఉండే పొగరు ఇప్పుడు లేదు. బేస్ వాయిస్ ఒక్కసారిగా పీలగా మారిపోయింది. మాటకు ముందు సవాళ్లు విసురుతూ బూతులు మాట్లాడే నాని.. చాలా డిఫెన్సివ్‌గా మాట్లాడుతూ ఆవేదన స్వరం వినిపించారు. దీంతో నాని అప్పుడు-ఇప్పుడు అంటూ టీడీపీ వాళ్లు తన వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. నాని ఎంత సౌమ్యుడిగా మారినా అతణ్ని వదిలిపెట్టేది లేదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.