జ‌గ‌న్ ఫొటోలు తొల‌గించండి: ఒక్క ఓట‌మి.. ఎంత చేసింది!

ఏపీలో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చాయి. అయితే.. ప్ర‌మాణ స్వీకారానికి ఇంకా నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. కానీ ఇంత‌లోనే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ.. రాజకీయాల‌ను వేడెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే.. ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల విష‌యంలో బ‌దిలీలు.. ప‌క్క‌న పెట్ట‌డం వంటివి తెలిసిందే.

అదేవిధంగా మ‌ద్యం విధానంపై బేవ‌రేజెస్ ఎండీగా ఉన్న వాసుదేవ రెడ్డిపైనా కేసులు న‌మోదు చేశారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో అమ‌లైన ప్ర‌తి ప‌థ‌కంలోనూ.. నాటి సీఎం జ‌గ‌న్ ఫొటోలు ముద్రించారు. అదేవిదంగా ఆయా శాఖ‌ల మంత్రుల ఫొటోల‌ను కూడా ముద్రించారు.

ఇక‌, ఇప్పుడు ఆయా శాఖ‌ల ప‌రిధిలోని అన్ని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలలో… మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఫోటోలు తొలగించాల్సిందిగా అన్ని డిపార్ట్‌మెంట్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

వీటిని 24 గంట‌ల‌లోగా తొల‌గించాల‌ని.. పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ.. గ్రామ, వార్డు స‌చివాల‌యాల్లోనూ.. జ‌గ‌న్ ఫొటోల‌ను త‌క్ష‌ణ‌మే తీసేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శినీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. అంతే కాదు.. గోడ‌ల‌పై జ‌గ‌న‌న్న‌ పేరుతో ముద్రించిన స్టిక్క‌ర్లు.. ఆ పార్టీ జెండా రంగుల‌ను కూడా తొల‌గించాల‌ని ఆదేశించారు.

ఇక‌, సామాజిక వ‌ర్గాలకు చెందిన 56 కార్పొరేష‌న్ల‌లో ఉన్న చైర్మ‌న్ల‌ను రాజీనామా చేయించే బాధ్య‌త‌ను క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. వారితో త‌క్ష‌ణమే రాజీనామా చేయించాల‌ని కూడా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక‌, ఇప్ప‌టికే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న భూమ‌న క‌రుణా క‌ర్ రెడ్డి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న కుమారుడు.. తిరుప‌తి న‌గ‌ర పాల‌క‌సంస్థ‌.. కార్పొరేష‌న్ బోర్డులో ఉన్న ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. అలాగే.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా.. టీటీడీ బోర్డు స‌భ్య‌త్వ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఇక‌, శ్రీశైలం బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న రెడ్డివారి చ‌క్ర‌పాణి రెడ్డి కూడా రాజీనామాకు రెడీ అయ్యారు. మొత్తంగా ఒక్క ఓట‌మితో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు ఇంటి ముఖం ప‌డుతున్నారు. చిత్రం ఏంటంటే.. ఆయా నామినేటెడ్ ప‌ద‌వుల కోసం.. నాయ‌కులు రూ.కోట్ల‌లో ఖ‌ర్చు పెట్టార‌ని పెద్ద ఎత్తున గుస‌గుస వినిపిస్తోంది.

అయితే.. ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌డం లేదు. అంత‌ర్గ‌తంగా కొంద‌రు టీడీపీని మ‌చ్చిక చేసుకుని.. ఆ పార్టీలోకి చేరైనా.. ఆయా ప‌ద‌వులు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తెలుస్తోంది.