కొడుకు, కూతురు మధ్య రాజకీయంలో నలిగిపోవడం కంటే దూరంగా ఉండటమే నయమనుకున్న వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు.
ఎన్నికలు అయేంతవరకూ ఇక్కడికి రాని విజయమ్మ తాజాగా జగన్ ఇంటికి వచ్చారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలా పడ్డ జగన్‌ను ఓదర్చడంతో పాటు చెల్లి షర్మిలతో రాజీ చేసుకోమని చెప్పేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లతో పాతాళానికి పడిపోయిన వైసీపీ పుంజుకోవాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ గురించి జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని తెలిసింది. తాడేపల్లిలోని జగన్ నివాసం కేంద్రంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ఓటమికి కారణాలను జగన్ విశ్లేషిస్తున్నారని తెలిసింది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు చెల్లి షర్మిల, సునీత కూడా జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీ ఓటమి కోసం గట్టిగా పనిచేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేశారు.
ఎన్నికల ప్రచారానికి ముందు జగన్‌ను ఆశీర్వదించిన విజయమ్మ.. జగన్, షర్మిల మధ్య నలగలేక అమెరికా వెళ్లిపోయారనే అభిప్రాయాలు వినిపించాయి. అక్కడి నుంచి షర్మిలకు మద్దతుగా ఆమె ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కడప ఎంపీగా షర్మిల ఓడిపోయారు. మరోవైపు జగన్ పార్టీ దారుణంగా పరాజయం పాలైంది.
ఈ నేపథ్యంలో జగన్ నివాసానికి వచ్చిన విజయమ్మ.. తన ఇద్దరు బిడ్డల మధ్య దూరం పెరగడంపై ఆవేదనతో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. కానీ జగన్ తిరిగి చెల్లిని ఆహ్వానిస్తారా? అన్నతో కలిసి షర్మిల పని చేస్తారా? అన్నవి ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలే.