ప్ర‌మాణ స్వీకారం..మంగ‌ళ‌గిరి కాదు.. గ‌న్న‌వ‌ర‌మే!

తాజా ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన టీడీపీ కూట‌మి సంబ‌రాల్లో ఉంది. మ‌రోవైపు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాలుగో సారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఈ సారి జ‌రిగిన ఎన్నికల్లో టీడీపీ కూట‌మి 164 స్థానాలు ద‌క్కించుకుంది. ఒక్క టీడీపీనే క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం ద‌క్కించుకుని పోటీ చేసిన 144స్థానాల్లో 135 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఈ సారి చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే.. తొలుత అనుకున్న‌ట్టు.. మంగ‌ళ‌గిరిలోని ఎయిమ్స్ స‌మీపంలో కాకుండా.. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి అత్యంత చేరువ‌లోని ప్రాంతంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు. ఈ క్ర‌మంలో పొలాల‌ను చదును చేసే ప‌నిని చేప‌ట్టారు. రేయింబవ‌ళ్లు ఈ ప‌నులు కొన‌సాగుతాయ‌ని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే ఏర్పాట్లు పూర్త‌వుతాయ‌ని తెలిపారు. దీనికి సంబంధించి ప్ర‌ముఖ ఆర్కిటెక్టుల‌ను నియ‌మించిన‌ట్టు చెప్పారు. గ‌న్న‌వ‌రం అయితేనే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి జాతీయ‌స్థాయిలో 50 మంది వ‌ర‌కు నాయ‌కులు రానున్న‌ట్టు తెలుస్తోంది. వీరు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. ఇక్క‌డ నుంచి మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మానికి రావాలంటే క‌నీసంలో క‌నీసం 20 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. దీంతో భ‌ద్రత‌, బ‌స వంటివి స‌మ‌స్య‌లుగా మారే అవ‌కాశం ఉంద‌ని ఉన్న‌తాధికారులు స‌హా టీడీపీ వ‌ర్గాలు భావించాయి. ప్ర‌ముఖ నేత‌లే కాకుండా.. ప్ర‌ధానిగా అప్ప‌టికి ప్ర‌మాణ స్వీకారం చేసే న‌రేంద్ర మోడీ.. ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా రానున్నారు. ఈ నేప‌థ్యంలోనే వేదిక‌ను మంగ‌ళ‌గిరి నుంచి గ‌న్న‌వ‌రం వ‌ర‌కు మార్చిన ట్టు తెలిపారు.

ఇక‌, చంద్ర‌బాబు ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి శ్రీశైలం, తిరుమ‌లకు చెందిన వేద పండితులు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ వేదిక‌పైనే న‌లుగురు మంత్రుల‌ను కూడా ప్ర‌మాణం చేయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మిగిలిన వారితో త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం చేయించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. కాగా, గ‌న్న‌వ‌రంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు పరిశీలించారు. పోలీసులు కూడా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు.