ఏపీలో వైసీపీ దారుణ ఓటమిని ఊహించని ఆ పార్టీ నాయకులు.. షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే.. ఈ ఓటమి విషయంలో కీలక నేతల వేళ్లన్నీ కూడా.. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)పైనే కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కింద ట రాజానగరం నియోజకవర్గంలో ఓడిపోయిన.. జక్కంపూడి రాజా మొదలుకుని.. తాజాగా ధర్మవరం నుంచి ఓడిపోయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వరకు కూడా అందరూ సీఎంవోనే తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన కొందరు అధికారులపై వారు నిప్పులు చెరుగుతున్నారు.
సీఎంవోలో ఉండి చక్రం తిప్పిన ఆర్. ధనుంజయరెడ్డి.. చుట్టూ వైసీపీ నాయకులు విమర్శలు ఎక్కు పెట్టారు. ఏ పనిమీద వెళ్లినా.. ఆయన అడ్డు పడ్డారని.. ముఖ్యమంత్రిని కలిసేందుకు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఎదురు చూసేలా చేశారని.. దీంతో ముఖ్యమంత్రికి తమకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని తాజాగా కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. సెల్ఫీవీడియోను ఒకదాన్ని ఆయన ఫేస్‌బుక్ లో పోస్టు చేశారు. సీఎంవో అధికారులుగా ఉన్న కొందరు.. తమను గంటల కొద్దీ నిలబెట్టారని చెప్పారు. అంతే కాదు.. సీఎం దగ్గర తమ పనులు విన్నవించేందుకు కూడా.. అవకాశం ఇవ్వలేదన్నారు.
అన్నీ తానే అయి.. ధనుంజయరెడ్డి చక్రం తిప్పారని.. ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో పనులు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. “మాకు సీఎంవోకు గ్యాప్ పెరిగిపోయింది. కొందరు అధికారులు వ్యవహరించిన తీరుతో సీఎం ఏం చెబుతున్నారో.. మాకు తెలిసేది కాదు” అని అన్నారు. ఈ ఫలితాలను అసలు తాము ఊహించలేదన్నారు. కనీసం కలలో కూడా ఓటమి చెందని నియోజకవర్గాల్లోనూ ఓడిపోయామని.. కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల కింద మాట్లాడిన రాజా కూడా.. అచ్చం ఇదే వ్యాఖ్యలు చేశారు.
‘పనికిమాలిన, చెత్త అధికారి’ అని ధనుంజయరెడ్డిపై రాజా విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గం సమస్యలు చెప్పుకొనేందుకు ప్రతి గురువారం.. సీఎంవోకు వెళ్లానని.. కానీ, ఫలితం లేకుండా పోయిందన్నారు. సీఎం జగన్ నమ్మిన వారంతా మోసం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ధనుంజయరెడ్డి అనే చెత్త అధికారి .. కనీసం ఎమ్మెల్యేలు అన్న గౌరవం కూడా ఇవ్వకుండా గంటల కొద్దీ నిలబెట్టారని తెలిపారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేల మాటంతా ఇలానే ఉంది. మరి దీనిలో నిజం ఎంత అనేది ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.