వెంటిలేటర్ మీద మీడియా మొఘల్ రామోజీరావు?

మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనాడు సంస్థల అధినేతగా సుపరిచితమైన ఆయన గడిచిన కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గుండె సంబంధిత సమస్య కారణంగా స్టంట్ వేశారు. అనంతరం ఆయన కొద్దిగా కోలుకున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా మారింది. దీంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు.

వయసు పెద్దది కావటంతో ఆయనకు చేస్తున్న చికిత్సకు బాడీ సహకరించటం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. తాజా బులిటెన్ కోసం రామోజీ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావటంతో రామోజీరావును అమితంగా అభిమానించే కోట్లాది మంది ఆయనకు స్వస్థత చేకూరాలని.. వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.