బాబు వల్ల అప్పుడు కాలేదు.. మరిప్పుడు?

2014లో ఎన్డీయేతో కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మోడీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కూడా. టీడీపీ వాళ్లకు మంత్రి పదవులు కూడా వచ్చాయి. కానీ ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ సానుకూల ఫలితాలు రాబట్టలేకపోయింది బాబు ప్రభుత్వం.

ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. అందుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటూ అంతకుమించి ప్రయోజనం చేకూర్చే ఫేవర్ చేస్తున్నట్లు చెప్పుకున్నారు. తీరా చూస్తే ప్యాకేజీ కూడా లేకపోయె. వేరే హామీలు కూడా నెరవేర్చలేదు. అనుకున్న స్థాయిలో నిధుల తోడ్పాటూ అందలేదు. దీంతో బాబు మోడీ సర్కారు నుంచి బయటికి వచ్చేశారు. ఎన్నికల ముంగిట ఈ పాచికా పారక బాబు గట్టి దెబ్బ తిన్నారు. అప్పుడు బాబు వైఫల్యానికి ప్రధాన కారణం.. బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండడం, బాబు పార్టీ మీద ఆధారపడే పరిస్థితి లేకపోవడం.

కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం మళ్లీ ఎన్డీయేలో భాగస్వామి అవుతోంది. ముందు తెలుగుదేశంతో బీజేపీ అయిష్టంగానే కలిసినట్లు కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకి సొంతంగానే భారీ మెజారిటీ వస్తుందనే సంకేతాలు కనిపించాయి. కానీ ఫలితాలు మాత్రం అంచనాలకు భిన్నంగా వచ్చాయి. మిత్ర పక్షాలైన తెలుగుదేశం+జనసేన, జనతాదళ్ పార్టీలతో కలిస్తే తప్ప మెజారిటీ రాని పరిస్థితి.

ఈ నేపథ్యంలో బాబు కేంద్రాన్ని శాసిస్తారా? ప్రత్యేక హోదా సహా కేంద్రం నుంచి కీలకమైన హామీలు పొందుతారా? నిధులు ఏ మాత్రం సంపాదిస్తారు.. అనే చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే సర్కారు వ్యతిరేకత గురించి తెలిసిందే. అది ఒక రకంగా చచ్చిపోయిన అంశం. కానీ ఆసక్తి రేకెత్తించే విషయం ఏంటంటే.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించి ఇండియా కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు సై అంటోంది. తమతో కలిస్తే హోదా హామీని నెరవేర్చడంతో పాటు మరిన్ని తాయిలాలు ఇవ్వజూపుతోంది. ఈ హామీలతో బాబును తమ వైపు తిప్పుకోవాలని కూడా చూస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీయేకి నమ్మకమైన మిత్రుడిగానే కొనసాగుతానని అంటున్నారు. కేంద్రంలో భాగస్వామి అయి 5 మంత్రి పదవులు, స్పీకర్ పదవిని కూడా తీసుకోవడానికి ఆయన రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే బీజేపీ పాలసీ ప్రకారం ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాబట్టి దాని విషయంలో బాబుకు హామీ దక్కకపోవచ్చు. కానీ గతంలో చెప్పిన ప్యాకేజీ రూపంలో అయినా భారీగా నిధులు, రాయితీలు తీసుకురాగలిగితే ఏపీకి ప్రయోజనం చేకూరబోతున్నట్లే.