గురితప్పిన గులకరాయి !

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ బస్సుయాత్రపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయి విసిరిన విషయం ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అభ్యర్థి బొండా ఉమను అరెస్టు చేస్తారన్న వార్తలు వచ్చాయి. చివరకు సతీష్‌ అనే యువకున్ని అరెస్టుచేసి నెల్లూరు జైలుకు పంపారు. నెల్లూరు జైలులో సుమారు నెల రోజులకుపైగా రిమాండ్‌లో ఉన్న సతీష్‌ బెయిల్‌పై ఈ నెల 3న విడుదలయ్యాడు. అయితే ఈ రాళ్ల దాడి అంతా ఒక ఎత్తుగడ అని, ఎన్నికల్లో నెగ్గడానికి చీప్ ట్రిక్స్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ విసిరిన గులకరాయి గురితప్పిందని చెబుతున్నారు.

గులకరాయి దాడి జరిగిన విజయవాడ సెంట్రల్ లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఏకంగా 68886 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. బోండా ఉమకు ఈ ఎన్నికల్లో 130034 ఓట్లు రాగా, వెల్లంపల్లికి కేవలం 61,148 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో బోండా ఉమ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. ఈ ఎన్నికల్లో మల్లాది విష్ణు మీద నమ్మకం లేక వైసీపీ వెల్లంపల్లిని దించినా ఓటమి తప్పలేదు.

విజయవాడ సెంట్రల్ మాత్రమే కాదు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మీద 49,640 ఓట్లతో విజయ సాధించాడు. విజయవాడ దక్షిణం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వైసీపీ అభ్యర్థి అసిఫ్ షేక్ పై 47,032 ఓట్లతో విజయం సాధించడం విశేషం. కృష్ణా జిల్లాలో 16 కు 16 స్థానాలు కూటమి అభ్యర్థులు విజయం సాధించడం విశేషం.