2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన విజయం చూసే.. ఇలాంటి గెలుపు నభూతో నభవిష్యతి అనుకున్నారందరూ. కానీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. అంతకు మించిన విజయంతో సంచలనం సృష్టించింది. జగన్ పార్టీ ఓటమి గురించి సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని.. మరీ 11 సీట్లకు పరిమితం అయిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఓటమి అనంతరం నిన్న జగన్ పెట్టిన ప్రెస్ మీట్‌తోనే ఆయన ఎంతగా డీలా పడిపోయారో అర్థం అయిపోయింది. తన్నుకొస్తున్న బాధను అణిచిపెట్టుకుంటూ ఆయన ఈ ప్రెస్ మీట్లో మాట్లాడారు. అసలెందుకు ఓటమి పాలయ్యామో అర్థం కావట్లేదంటూ.. తాము మేలు చేసినా అండగా నిలవని వర్గాల గురించి జగన్ మాట్లాడుతూ.. చివరగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడతామని సెలవిచ్చారు.
దీంతో పాటుగా పోరాటాలు, కష్టాలు తనకు కొత్త కాదంటూ తన రాజకీయ జీవితంలో గత ఐదేళ్లు తప్ప అలాగే సాగిందని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగంలో అందరి దృష్టినీ ఆకర్షించిన మాట ఒకటి ఉంది. గతంలో ఎన్నో కష్టాలు చూశానని.. ఇక ముందు ఇంకా తనను కష్టపెట్టడానికి చూస్తారని జగన్ వ్యాఖ్యానించాడు. ఈ మాటకు అర్థమేంటి అని ఇప్పుడు వైసీపీ అభిమానులతో పాటు అందరూ చర్చించుకుంటున్నారు.
జగన్ మీద 30కి పైగా అక్రమాస్తుల కేసులున్నాయి. వాటిలో చాలా వరకు తీవ్రమైన కేసులే. ఈ కేసుల్లో బెయిల్ తెచ్చుకుని పదేళ్లకు పైగా బయట తిరిగేస్తున్నాడు జగన్. 2014 ఎన్నికల తర్వాత బలమైన ప్రతిపక్షంగా అవతరించడం ద్వారా ఎలాగోలా బెయిల్ విషయంలో మేనేజ్ చేయగలిగారు. ఇక 2019లో అధికారంలోకి రావడంతో ఇక జగన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. మోడీ సర్కారు అడిగినా అడక్కున్నా మద్దతు ఇస్తూ కేసుల విషయంలో పురోగతి లేకుండా చూసుకోగలిగారు. కానీ ఇప్పుడు జగన్ పార్టీ ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. టీడీపీ, జనసేన కేంద్ర ప్రభుత్వంలో భాగం అవుతున్నాయి. కాబట్టి ఇక జగన్ మేనేజ్ చేయడానికి అవకాశమే లేకుండా పోయింది.
జగన్ అండ్ కో గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుతో.. టీడీపీ ఊరికే ఉండే అవకాశం లేదు. కచ్చితంగా జగన్ అక్రమాస్తుల కేసులను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతాయి. జగన్ బెయిల్ రద్దయినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే తాను మరిన్ని కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చినట్లున్నాడు జగన్.