భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, సిక్సర్ల వీరుడు యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే భారీ సిక్సర్ కొట్టాడు. పశ్చిమబెంగాల్‌లోని బరంపుర నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై 85 వేల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశాడు. బరంపురంలో వరుసగా 5 సార్లు గెలిచిన అధీర్ రంజన్ 25 ఏండ్ల తర్వాత ఓటమి పాలయ్యాడు.
ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి పట్ల వ్యవహరించిన తీరును అధీర్ రంజన్ తీవ్రంగా నిరసించాడు. ఇక టీఎంసీ నుంచే బరిలో ఉన్న మరో మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన కృతి ఆజాద్ దుర్గాపూర్ లోక్ సభ స్థానం నుండి పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై లక్షా 37 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు.
అదే పార్టీకి చెందిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు ప్రసూన్ బెనర్జీ హౌరాలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ రితిన్ చక్రవర్తిపై 169442 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించాడు. బీజేపీ తరఫున బరిలో నిలిచిన పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియా రాజస్థాన్ లోని చురు లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ కాస్వాన్ చేతిలో72737 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఒడిశాలోని సుందర్‌గఢ్ నుండి బిజూ జనతాదళ్ తరపున పోటీ చేసిన హాకీ మాజీ సారథి దిలీప్ టిర్కీ బీజేపీ అభ్యర్థి ఓరమ్ చేతిలో 138808 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates