ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. గత ఎన్నికలకు భిన్నంగా ఏపీ ప్రజలు ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. గాజు గ్లాసు, సైకిల్, కమలం పువ్వు గుర్తులతో ఓటర్లలో గందరగోళం రేపుతుందన్న ఆందోళన ఉండగా అవన్నీ పటాపంచలు చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు.
జనసేన పోటీ లేని చోట ఎన్నికల కమీషన్ గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. దీని మీద చివరి వరకు ఎన్నికల కమీషన్, న్యాయస్థానాలలో జనసేన పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినా జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో విజయం సాధించడంతో జనసేన సైనికుల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది.
గాజువాక నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమిపాలయ్యారు. ఈసారి అక్కడి నుండి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95, 235 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ ఏకంగా 92, 401, మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేశ్ 91, 413 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి రమేశ్ 81, 870, నెల్లూరు అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి నారాయణ 72,489, తణుకులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ 72,121, కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 71,404, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్- 70, 279 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates