కర్ణాటకలో కాంగ్రెస్ కు ఝలక్

కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్తకు మాత్రమే పరిమితం అయింది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌ రెండు చోట్ల గెలిచింది. గెలిచిన వారిలో మాజీ సీఎంలు బసవరాజ్‌ బొమ్మై, హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి ఉన్నారు.

మరోవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ బెంగళూరు రూరల్‌ లోక్‌సభ స్థానం నుంచి 2,69,647 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి, దేవెగౌడ అల్లుడు సీఎన్‌ మంజునాథ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. గత కొన్ని రోజులుగా సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలతో వార్తలకెక్కిన ప్రజ్వల్‌ రేవణ్ణ పరాజయం పాలయ్యారు. హసన్‌ నుంచి పోటీచేసిన ప్రజ్వల్‌ రేవణ్ణ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయాస్‌ ఎం పటేల్‌ చేతిలో 42,649 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మాండ్య నుండి పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడపై 284620 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. బెల్గాం, బాగల్ కోట్, బీజాపూర్, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, శిమోగా, దక్షిణ కన్నడ, ఉడుపి చిక్ మగ్ ళూర్, చిత్రదుర్గ, తుమకూర్, మైసూర్, బెంగుళూరు ఉత్తర, రూరల్, సెంట్రల్, సౌత్ నియోజకవర్గాలతో పాటు చిక్ మగ్ ళూరు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం.