ఏపీ ఫలితాలపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు అభినందనలు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం వైపు ముందుకు సాగేలా అడుగులు వేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీకి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, గతంలో ఆయన నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కచ్చితంగా చక్కటి సంబంధాలు ఏర్పడి ఇరు రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ గెలిచారని, వారిద్దరూ పరస్పర సహకారం అందించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

అదేవిధంగా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడా సహకరించుకుంటారని అంటున్నారు. 2019, 2024 ఈ రెండు ఎన్నికలలో ఒకరికి ఒకరు సహకారం అందించుకునే వారే గెలిచారని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఏపీలో జగన్ గెలిచి ఉంటే రేవంత్ తో సత్సంబంధాలు ఉండేవో కాదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.