ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చీకటి రోజుల పోయాయని, ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని పవన్ అన్నారు. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని పవన్ హామీనిచ్చారు. ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యతనిచ్చారని పవన్ అన్నారు. ఈ విజయం జనసేనది కాదని, 5 కోట్ల మంది ఆంధ్రులదని పవన్ కళ్యాణ్ అన్నారు.
సీపీఎస్ విషయంలో న్యాయం జరిగేలా చూస్తానని ఉద్యోగులకు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని నిరుద్యోగులకు పవన్ హామీ ఇచ్చారు. 2019లో రెండు చోట్ల ఓడిపోయిన రోజు తన మానసిక స్థితి ఎలా ఉందో, ఈరోజు కూడా అలాగే ఉందని చెప్పారు. 175 సీట్లు గెలిపిస్తే ఎలా ఉంటుందో తాను ప్రజలకు చూపిస్తానని చెప్పారు. వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తక్కువగా ఉండేలా చూస్తానని అన్నారు. ఇల్లలగ్గానే పండగ కాదని చెప్పారు.
డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదని, మనకెవరూ లేరే అని నలిగిపోయే సగటు మనిషి కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పదవి అని అన్నారు. జగన్ వ్యక్తిగతంగా తనకు శత్రువు కాదని, ఇది కక్ష సాధింపులకు సమయం కాదని, ప్రజల కోసం పనిచేసే సమయమని పవన్ అన్నారు. భీమవరం, గాజువాకలో ఓడిపోయినప్పుడు తన పక్కన కొద్ది మంది సన్నిహితులు, జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారని, ఈ రోజు తన పక్కన చాలా మంది ఉన్నారని గుర్తు చేసుకున్నారు
పిఠాపురం ప్రజలందరికీ, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలకు, టిడిపి నాయకులు, టిడిపి శ్రేణులకు , బీజేపీ నేతలు, బీజేపీ శ్రేణులకు, టిడిపి నేత వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పిఠాపురం ప్రజల కష్టాలలో వారి కుటుంబ సభ్యుడిలా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. మన ఇంట్లో ఒకడు అసెంబ్లీకి వెళ్ళాడు, మన సమస్యల గురించి పోరాడుతాడు, ప్రశ్నిస్తాడు అని పిఠాపురం ప్రజలు అనుకోవాలని అన్నారు.