ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఓటమి పాలవడం ఆ పార్టీ నేతలకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలలో ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ తొలిసారిగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఇటువంటి ఫలితం వస్తుందని ఊహించలేదని జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోట్లాదిమందికి సంక్షేమం అందించామని, గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మంచి చేసినా ఈ ఫలితం వచ్చిందని విషన్న వదనంతో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల బాగు కోసం అడుగులు వేసిన ప్రభుత్వానికి ఇటువంటి ఫలితం వస్తుందని ఊహించలేదని జగన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని, 53 లక్షల మంది తల్లులకు, వారి పిల్లలకు, 66 లక్షల మంది అవ్వా తాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశామని, ఆ ఓట్లు ఏమయ్యాయో తెలీదని చెప్పారు. కోటి 5 లక్షల మందికి సంక్షేమాన్ని అందించామని, 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా తోడుగా నిలిచిన ప్రభుత్వం తమదని అన్నారు.
ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడి అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డామని, అయినా సరే ఇటువంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని జగన్ చెప్పారు. సామాజిక న్యాయం చేసి చూపించామని, మేనిఫెస్టోను పవిత్రంగా భావించి అమలు చేశామని, అయినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని అన్నారు. ప్రజల తీర్పును తీసుకుంటామని, పేదవాడికి తోడుగా అండగా ఎప్పుడూ నిలబడతామని జగన్ అన్నారు. పెద్ద పెద్ద నేతల కూటమి ఇదని, బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గొప్ప విజయానికి, కూటమి నేతలకు తన అభినందనలు అని జగన్ అన్నారు.
తనకు తోడుగా నిలబడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి, స్టార్ క్యాంపైనర్ కి, అక్కచెల్లెమ్మలకు జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఏం జరిగిందో తెలియదని, అన్యాయం జరిగిందని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు. ఎంత చేసినా తమకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని చెప్పారు. కిందపడినా గుండె ధైర్యంతో పైకి లేస్తామని, ప్రతిపక్షంలో ఉండడం, పోరాడడం తనకు కొత్త కాదని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితం అంతా కష్టాలమయమని, ఈ ఐదేళ్లు మినహాయిస్తే రాజకీయపరంగా ఎవరూ అనుభవించని కష్టాలు అనుభవించానని గుర్తు చేశారు. తనని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా, దేనికైనా సిద్ధమని జగన్ చెప్పారు. కొత్త ప్రభుత్వానికి ఆల్ ది వెరీ బెస్ట్ అని జగన్ మీడియా సమావేశాన్ని ముగించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates